కుండపోత వానలతో మునిగిన బీజింగ్

- August 03, 2023 , by Maagulf
కుండపోత వానలతో మునిగిన బీజింగ్

బీజీంగ్‌: కుండపోత వానలు పొరుగుదేశం చైనాను వదలడం లేదు. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. దీంతో రాజధాని ప్రాంతం మొత్తం జలమయమైంది. వీధులు కాల్వలుగా మారిపోయాయి. నీళ్లలో చిక్కుకున్న వారిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీజింగ్‌లో శనివారం నుంచి బుధవారం ఉదయం దాకా ఐదు రోజుల్లో 74 సెంటమీటర్ల వర్షం కురిసిందని, బీజింగ్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రికార్డు స్థాయి వానలకు హెబీయ్ ప్రావిన్స్‌ కూడా తీవ్ర ప్రభావితమైంది. రోడ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. కొన్ని రోజులు కరెంటు పోయింది. తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి.

వరదలకు ఎయిర్‌‌పోర్టుల్లోకి నీళ్లు వచ్చాయి. రోడ్లపై ఎక్కడ చూసినా భారీ వరద. అసలు ఎక్కడా నేల కనిపించడం లేదు. వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు బీజింగ్‌లో 21 మంది చనిపోయారు. మరో 26 మందికి పైగా గల్లంతయ్యారు. దాదాపు 8.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు హెబీయ్ ప్రావిన్స్ అధికారులు ప్రకటించారు. చివరిసారిగా 1891లో అతి భారీ వర్షాలు కురిశాయని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. అప్పట్లో 61 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com