సీఎం జగన్‌కి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు నాయుడు...

- August 03, 2023 , by Maagulf
సీఎం జగన్‌కి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు నాయుడు...

అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా కార్ల పరిశ్రమ వద్ద టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకున్నారు. ‘ నేను కియాను తీసుకొచ్చాను.. నువ్వు మాఫియాను తీసుకొచ్చావు జగన్ ‘ అంటూ సెల్ఫీని చంద్రబాబు పోస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ‘పెన్నా నుంచి వంశధార’ ఈ యాత్ర చేస్తున్నారు. నేటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటన ప్రారంభమైంది. పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్లను సందర్శించారు. అనంతరం కియా కార్ల పరిశ్రమను పరిశీలించారు. ఈ సందర్భంగానే సెల్ఫీ తీసుకున్నారు.

ఇటువంటి పరిశ్రమను జగన్ తీసుకురావడం లేదని, ప్రస్తుత సీఎం తీసుకువచ్చిన కనీసం ఒక్క పరిశ్రమతోనైనా సెల్ఫీ తీసుకోగలరా? అని చంద్రబాబు నాయుడు సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నని నిలదీశారు. పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్ట్ లు ఎన్నో చెప్పాలన్నారు.

తాము యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని తెలిపారు. రికార్డ్ సమయంలో దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు అయిందన్నారు. ఇటీవల 10 లక్షల కార్ల ఉత్పత్తిని కియా అనంతపురం పరిశ్రమ పూర్తి చేసుకుందని తెలిపారు. కియా కార్ల అమ్మకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.56 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com