హైద‌రాబాద్ లో ప‌రుగులు తీయ‌నున్న 'గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బ‌స్సులు'

- September 19, 2023 , by Maagulf
హైద‌రాబాద్ లో ప‌రుగులు తీయ‌నున్న \'గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బ‌స్సులు\'

హైదరాబాద్: హైద‌రాబాద్ లో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బ‌స్సుల‌ను పెంచే దిశ‌లో టి.ఎస్‌.ఆర్టీసీ  క‌స‌ర‌త్తు చేసి ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. 

న‌గ‌ర‌వాసుల కోసం నూత‌నంగా “గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ” ఏసీ బ‌స్సుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. బుధ‌వారం నుంచి ఈ బ‌స్సులు న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ స‌ర్వీసుల్లో మొద‌టి విడ‌త‌గా 25 బ‌స్సులు వ‌స్తున్నాయి. 

బుధ‌వారం రోజు (ఈ నెల 20న‌) ఈ బ‌స్సుల్ని ర‌వాణా శాఖ మంత్రివ‌ర్యులు పువ్వాడ అజ‌య్ కుమార్ గారు గ‌చ్చిబౌలి స్టేడియం ద‌గ్గ‌ర ప్రారంభించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎం.ఎల్‌.ఎ, వీసీ అండ్ ఎండీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌ కూడా పాల్గొంటున్నారు. 

పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రయాణీలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించ‌నున్నాయ‌ని, మిగిలిన 25 బ‌స్సులు న‌వంబ‌రు నాటికి అందుబాటులోకి రాగ‌ల‌వ‌ని టి.ఎస్‌.ఆర్టీసీ ప్ర‌క‌టించింది. 

ఈ బ‌స్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెద‌జ‌ల్ల‌వు. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే సౌల‌భ్యం ఉంటుంది. 3గంట‌ల‌ నుంచి 4 గంటల లోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వ‌డ‌మే కాకుండా క్యాబిన్,సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ స‌దుపాయాలు క‌లిగి ఉన్నాయి.  

ప్ర‌యాణంలో ఆహ్లాదాన్ని పంచే గ్రీన్ లగ్జ‌రీ ఏసీ బ‌స్సుల ప్ర‌త్యేక‌త‌లివే...

12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జ‌రీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 

35 సీట్ల సామర్థ్యం గ‌ల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంది. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. 

ప్రతి బస్సులోనూ 2 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది.బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. 

అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com