ఏపీలో మా కూటమిలోకి బీజేపీ కచ్చితంగా వస్తుందనుకుంటున్నా: పవన్

- October 06, 2023 , by Maagulf
ఏపీలో మా కూటమిలోకి బీజేపీ కచ్చితంగా వస్తుందనుకుంటున్నా: పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, కూటములు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అమరావతిలో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నానని పవన్ తెలిపారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటాం? ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం? అనేది వైసీపీకి అనవసరమని అన్నారు. 2014లో పోటీ చేసిన కూటమి మళ్లీ 2024లో కలిసి వెళ్లాలని తన ఆకాంక్ష అని చెప్పారు.

టీడీపీతో పొత్తు గురించి ఢిల్లీకి వెళ్లి ప్రకటించాలి అనుకున్నానని తెలిపారు. అయితే, వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో జీ20 సమావేశాల వల్ల బీజేపీ అగ్రనేతలు అందుబాటులో లేరని తెలిపారు. జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ ఆల్రెడీ ఉందని తెలిపారు.

ఇటీవల టీడీపీ-జనసేన కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. నాదెండ్ల మనోహర్ అధ్యక్షుడిగా అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు గురించి చర్చలు జరగాలని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమయం ఉందని, వచ్చాక కో-ఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. జగన్‌ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ సర్కారు అలవాటుగా మారిపోయిందని తెలిపారు. అక్రమ కేసులు పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టస్తున్నారని అన్నారు. ఏపీలో జరుగుతున్నదంతా కేంద్రానికి తెలియజేశామని చెప్పారు.

తెలంగాణకు పసుపు బోర్డు వచ్చిందని, జగన్ డిల్లీకి వెళ్లి కోకోనట్ బోర్డు తీసుకురాలేక పోయారని అన్నారు. జగన్ డిల్లీకి వెళ్లేది కేసుల గురించి కానీ రాష్ట్రం గురించి కాదని విమర్శించారు. కేంద్రంతో వైసీపీ సర్కారు లాబియింగ్ రాష్ట్రం కోసం చేస్తుందా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తుందా? అని అన్నారు. జగన్ వ్యక్తిగత విషయాల కోసం కేంద్రంతో వైసీపీ సర్కారు లాబియింగ్ చేస్తోందని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com