ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే దుబాయ్ కి ప్రయాణం

- October 19, 2023 , by Maagulf
ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే దుబాయ్ కి ప్రయాణం

దుబాయ్: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్ ప్రభుత్వం.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది. దీనికి కారణం స్మార్ట్ టెక్నాలజీ. అద్భుతమైన స్మార్ట్ ఆలోచనతో ముందుకు వస్తోంది. భవిష్యత్‌లో దుబాయ్ నివాసితులు, సందర్శకులు ఎలాంటి పాస్‌పోర్ట్, వీసా, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే ప్రయాణించే దిశగా అడుగులేస్తోంది. దీని కోసం ఓ ప్రత్యేకమైన స్మార్ట్ టెక్నాలజీ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎమారాటెక్  అనే టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA)తో కంపెనీ కలిసి పని చేస్తోంది.

ఈ సందర్భంగా ఎమారాటెక్ మేనేజర్ అహ్మద్ బహా మాట్లాడుతూ.. 'ఒక ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, వారు మాకు ఎలాంటి ట్రావెల్ పత్రాలు చూపించకుండానే మేము వారి తాలూకు డేటాను వారి ముందు ఉంచుతాము. వారి ఫ్లైట్, వీసా వివరాలు మా సిస్టమ్‌లో ఉంటాయి' అని అన్నారు. ఇలా ప్రయాణికుల స్మార్ట్ చెకింగ్ అనేది చెక్-ఇన్ కౌంటర్ వద్ద నుంచే ప్రారంభం అవుతుందన్నారు. అక్కడ ప్రయాణికుల ఫొటోలు క్యాప్చర్ చేయబడి, వారి ముఖ లక్షణాలను స్కాన్ చేసే స్ట్రీమ్‌లైన్డ్ ప్రక్రియ ఉంటుంది. తద్వారా వారి సమగ్ర ప్రయాణ సమాచారం అందించబడుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com