ఎలివేటెడ్ బస్: చైనా

- May 23, 2016 , by Maagulf
ఎలివేటెడ్ బస్: చైనా

ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్(టీఈబీ) ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు. ప్రపంచ రవాణా వ్వవస్ధలో దీనిని విప్లవంగా చెప్తున్నారు. సాధారణంగా రోడ్డుకు మధ్యలో వేసిన పిల్లర్ల సాయంతో మెట్రో రైలు వెళ్లడం బెంగుళూరు, ఢిల్లీలాంటి నగరాల్లో చూశాం. త్వరలో ఈ మెట్రో రైలు హైదరాబాద్‌లో పట్టాలెక్కనుంది. పిల్లర్ల సాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాక్ సాయంతో ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్(టీఈబీ) వెళుతోంది. ఈ టీఈబీని చైనా ఇంజనీర్లు రూపొందించారు. రోడ్డుపై ఉన్న వాహనాల రాక పోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ఎలివేటెడ్ బస్ ప్రయాణిస్తుంది. 19వ చైనా బీజింగ్ అంతర్జాతీయ హైటెక్-ఎక్స్ పోలో ఈ ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ బ్లూ ప్రింట్‌ను ప్రదర్శించారు. ఈ బ్లూ ప్రింట్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ బ్లూ ప్రింట్ వివరాలిలా ఉన్నాయి. ప్రయాణికుల కోసం పై భాగంలో ప్రత్యేకంగా ఓ కంపార్ట్ మెంట్ ఉంది. కింది భాగాన రోడ్డుపై వెళ్లే వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంది. ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్‌ను రోడ్డును పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం ఉంటుంది. 'ఎలివేటెడ్ బస్‌లో 1200 మంది ప్రయాణించే అవకాశం ఉంది. మెట్రో రైలులో ఉండే అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు, మెట్రో నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేవలం ఐదోవంతు మాత్రమే.' అని టీఈబీ ప్రాజెక్ట్ ఇంచార్జ్ ఇంజనీర్ జిమింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఉత్తర చైనాలోని క్విన్ హువాంగడో సిటీలో 2016 ఏడాది చివరి కల్లా ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ ట్రయల్ రన్‌ను ప్రదర్శించి దాని పని తీరును చూడనున్నట్టు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com