తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ

- November 07, 2023 , by Maagulf
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, వారికి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుందని విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, బీసీని సీఎంగా చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

ఈ మైదానంలో జరిగిన సభతోనే మోడీ ప్రధాని అయ్యేందుకు బాటలు పడ్డాయి..
” ఈ గ్రౌండ్ కు నాకు అనుబంధం ఉంది. 2013లో నా సభకు వచ్చిన వారు టికెట్ కొనుక్కొని వచ్చారు. ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ మైదానంలో జరిగిన సభతోనే మోడీ ప్రధాని అయ్యేందుకు బాటలు పడ్డాయి. ఈసారి ఇదే మైదానం నుంచి బీసీ సీఎం చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో మార్పు తేవాలని నిర్ణయించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి విరోధి ప్రభుత్వం ఉంది. బీసీ వ్యతిరేక ప్రభుత్వంను పీకి పారేయాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రం నీళ్ళు, నిధులు నియామకాల కోసం ఏర్పడింది. ఈ మూడు హామీలను నెరవేర్చకుండా ఇక్కడి సర్కారు మోసం చేసింది. రాష్ట్రం కోసం ఎంతో మంది అమరులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. వెనుకబడిన వర్గాల ఆకాంక్షలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సీ టీమ్ గా పని చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ లో మూడు అంశాలు కామన్ గా ఉంటాయి. అవినీతి, కుటుంబ పాలన మాత్రమే బీఆర్ఎస్ లో ఉన్నాయి.

కుటుంబంతో నడిచే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీలకు సీఎం అవకాశం ఇవ్వవు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఈ సభలోనే మీ ఆదేశాలతో పూర్తి మెజారిటీతో ఓబీసీని ప్రధానమంత్రి చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుండి మీరు కోరుకుంటే తెలంగాణలో మొదటి ఓబీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.

దేశంలో 365 మంది శాసనసభ్యులు, 65 మంది శాసనమండలి సభ్యులు బీజేపీ నుంచి ఉన్నారు. తెలంగాణలో కూడా బీసీలకు అనేక పదవులు ఇచ్చాం. బీసీలకు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తా అని మాట తప్పింది. ఓబీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మెడికల్ సీట్లలో 27శాతం బీ‌సీలకు రిజర్వేషన్లు కల్పించాం. చేతివృత్తుల అభ్యున్నతికి పీఎం విశ్వకర్మ యోజన పథకం తీసుకొచ్చాం.

అహంకారం ఎవరికి ఉన్నా వారిని ఓడించాలి. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుంది. ఇక్కడ అవినీతి నేతలు ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉన్నారు. విచారణ చేపడుతున్న ఏజెన్సీలపైనా ఆరోపణలు చేస్తున్నారు. అవినీతిపరులపై విచారణ జరుగుతుంది. లూఠీ చేసిన వారికి శిక్ష తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోచుకున్నాయి. ఈ రెండు పార్టీలు వారసులకు అధికారం ఇచ్చేందుకు పాటు పడుతున్నాయి.

నిరుద్యోగ యువతకు ఈ ప్రభుత్వం ఢోకా చే‌సింది. టీఎస్ పీఎస్ సీ పరీక్షల పేపర్లు లీకై వెనకబడిన వర్గాల యువత నష్టపోయింది. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చలేదు. వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యువకులను మోసం చేసే బీఆర్ఎస్ పార్టీ పోవాలా లేదా? తప్పించాలా వద్దా? డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ నెరవేర్చలేదు.

కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల పాలనలో 4 కోట్ల ఇళ్లు కట్టించింది. తెలంగాణలో కూడా 2లక్షల ఇళ్లు కట్టించాం. కోవిడ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పేదల నుంచి వచ్చిన మోదీ పేదలను ఆకలితో పడుకోనివ్వకూడదని ఉచిత రేషన్ అందిస్తున్నాం. ఈ పథకం డిసెంబర్ లో ముగుస్తుంది. కానీ పేదలను ఆకలితో ఉండనీయకుండా మరో ఐదేళ్లు ఈ పథకం కొనసాగిస్తాం.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. లక్ష రూపాయల రుణమాఫీ హామీ నెరవేర్చకుండా ఇబ్బందుల పాలు చేసింది. తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం 9వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయం చేసింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. నాకది కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com