గల్ఫ్ లో మృతిచెందిన పేద వలసకార్మికుల పిల్లల చదువులకు స్కాలర్ షిప్ ల చేయూత
- May 25, 2016 
గల్ఫ్ దేశాలలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసీలు 200 కు పైగా చనిపోతున్నారు. 600 కు పైగా గల్ఫ్ మృతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) కోసం ప్రభుత్వ సహాయం కోసం ఎదిరిచూస్తున్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఉడతా భక్తిగా సహాయం చేయడానికి దుబాయి లోని 'ఐ-కేర్' అనే సంస్థ కరీంనగర్ జిల్లాలోని రెండు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం 'ప్రవాసి మిత్ర' మాసపత్రిక అనుసంధానకర్తగా వ్యవహరించింది. ఖతార్ లోని తెలంగాణ ప్రజా సమితి (టి.పి.ఎస్) వ్యవస్థాపక సభ్యులు పడకంటి వేణుగోపాల్ ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. మూడు వేల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.
24 మే 2016 న NSS హైదర్ గూడ లో జరిగిన సమావేశంలో గల్ఫ్ లో మృతిచెందిన పేద వలసకార్మికుల పిల్లల చదువులకు చేయూతనివ్వడానికి స్కాలర్ షిప్ లను పంపిణీ చేశారు.
పాల్గొన్నవారు:
1. జంధ్యాల వెంకట పద్మజ, 'ఐ-కేర్', దుబాయి సంస్థ నిర్వాహకురాలు
2. మంద భీంరెడ్డి, ఎడిటర్, 'ప్రవాసి మిత్ర', హైదరాబాద్
3. లక్ష్మన్ ఏనుగు, ఉపాధ్యక్షులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టి.డి.ఎఫ్), అమెరికా
4. కరుణాకర్ అసిరెడ్డి, భవిష్యత్ అధ్యక్షులు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)
లాభోక్తులు:
1. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన కు చెందిన ఒలవేణి సౌందర్య ఇటీవల పదవతరగతి పాస్ అయినది. ఈమె తండ్రి ఒలవేణి లక్ష్మినర్సయ్య 20 జులై 2015 న సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించారు. చనిపోయిన అయిదు నెలలకు 15 డిసెంబర్ 2015 మృతదేహం ఇంటికి చేరింది. సౌందర్యకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, తల్లి దినసరి కూలి. బొమ్మెన ప్రభుత్వ హైస్కూల్ లో చదివే సౌందర్య అయిదు నెలలు తండ్రి శవం కోసం ఎదిరిచూస్తూ, ఏడుస్తూ కూడా చదువుపై శ్రద్ధ పెట్టింది. ఇటీవలి రిజల్ట్స్ లో పాస్ అయ్యింది, కాని పైచదువులకు వెళ్ళలేని ఆర్ధిక పరిస్థితి. 'భేటీ బచావో... భేటీ పడావో' స్పూర్తితో ఈమెకు సహాయం చేయడానికి మలేసియాలోని సామాజిక సేవకురాలు శాంతిప్రియ, దుబాయిలోని 'ఐ-కేర్' సంస్థ నిర్వాహకురాలు జంధ్యాల వెంకట పద్మజ ముందుకు వచ్ఛారు.
2. కరీంనగర్ జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరు కు చెందిన దుర్గం భీమయ్య అనే వలస కార్మికుడు ఒమాన్ దేశంలో నివసించేవాడు. స్వదేశం రావడానికి భారీ జరిమానా చెల్లించలేని అతను 2 మే 2012 న మస్కట్ (ఒమాన్) నుండి దుబాయి (యు.ఎ.ఇ.) దేశానికి సరిహద్దు దాటుతుండగా సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఏవో గాయాల వలన మరణించినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్ళుగా మృతుని భార్య స్వప్న ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నది, కూలీ నాలీ చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే కుమారుడు శ్రావణ్ కుమార్ 8వ తరగతి, కుమార్తె శ్వేత వైష్ణవి 6వ తరగతి చదువాల్సి ఉన్నది. ఈ ఇద్దరు పిల్లల చదువుకు సహాయం చేయడానికి ఖతార్ లోని తెలంగాణ ప్రజా సమితి (టి.పి.ఎస్) వ్యవస్థాపక సభ్యులు పడకంటి వేణుగోపాల్, దుబాయిలోని 'ఐ-కేర్' సంస్థ నిర్వాహకురాలు జంధ్యాల వెంకట పద్మజ ముందుకు వచ్ఛారు.
బ్రతుకు భరోసా
3. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన పేద మహిళ యాస్మిన్ తన ఇద్దరు పిల్లలను వదిలి బ్రతుకుదెరువు కోసం సౌదీ అరేబియాలో ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ యజమాని పెట్టె హింసను భరించలేక ఇండియన్ ఎంబసీ సహాయంతో వాపస్ వచ్చారు. ఆమె భర్త పరుపుల దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారికి ఉపాధి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కుటుంబంతో, సమాజంతో పునరేకీకరణకు సహకరించాలి. తన ఐదేళ్ళ కుమార్తె అల్తీఫా, నాలుగేళ్ల కుమారుడు బిలాల్ ను సరిగా పోషించలేని పరిస్థితిలో మానసికంగా కుంగిపోయిన యాస్మిన్ ను సామాజిక కార్యకర్త హజరా సాలమ్ కౌన్సిలింగ్ నిర్వహించి బ్రతుకుపై ఆశ కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న 'ఐ-కేర్' సంస్థ నిర్వాహకురాలు జంధ్యాల వెంకట పద్మజ యాస్మిన్ పిల్లల పోషణకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి బ్రతుకు భరోసా కల్పించారు.



తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







