కెనడాలో ఈ-వీసా సేవల పునరుద్ధరణ

- November 22, 2023 , by Maagulf
కెనడాలో ఈ-వీసా సేవల పునరుద్ధరణ

న్యూ ఢిల్లీ: కెనడాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే భారత్‌-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య ప్రతిష్టంభనతో కెనడాలో నిలిపివేసిన వీసా సేవలను తాజాగా పునరుద్ధరించింది . ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దాదాపు 2 నెలల తర్వాత కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను బుధవారం నుంచి భారత్‌ పునరుద్ధరించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి.

ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత భారత్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసా సర్వీసులను పునరుద్ధరించింది. ఇప్పుడు తాజాగా ఈ-వీసా సేవలను కూడా పునరుద్ధరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com