పీకింగ్ వర్సిటీ కి హాజరు అయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

- May 26, 2016 , by Maagulf
పీకింగ్ వర్సిటీ కి హాజరు అయిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

చైనా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ పీకింగ్ వర్సిటీ వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చైనా, భారత్ ప్రజలు కలిసికట్టుగా ఏదైనా సాధించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. భారత విజయగీతికలో భాగంకండి భారత ఆర్థిక విజయగీతికలో చైనా భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆకాంక్షించారు. అనతికాలంలోనే చైనా సాధించిన ఆర్థిక విజయాలు భారత్ ఆదర్శమని పేర్కొన్నారు. ఫార్మా, ఐటీ రంగాల్లో విస్తృతమైన ప్రగతి సాధిస్తున్న భారత్.. ఆయా రంగాల్లో అతి పెద్ద మార్కెట్‌కోసం ఎదురుచూస్తున్నదని తెలిపారు. చైనా వంటి భారీ మార్కెట్లలో భారత్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మంగళవారం చైనా పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి బుధవారం గువాంగ్‌ఝౌలో ఇండియా-చైనా బిజినెస్ ఫోరం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల్లో పెట్టుబడులు విస్తృతంగా పెరుగాలని అభిలాషించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారం పెరుగాలని, కొన్నేండ్లుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సానుకూల వాతావరణం ఇందుకు ఇతోధికంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 47వేల కోట్లకు చేరిందని పేర్కొన్న రాష్ట్రపతి.. ఇందులో 27వేల కోట్లు భారత్ నుంచి చైనాకు పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. భారత్‌లో చైనా పెట్టుబడులు మరింత పెరుగాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో రెండు దేశాలకు సమాన వాటా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మౌలికవసతులు, నిర్మాణరంగాల్లో శక్తిమంతమైన చైనా కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని, అదేసమయంలో మేడిన్ చైనా 2025 కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు భారత్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాలు పూర్తి విశ్వాసంతో ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. చైనా పారిశ్రామికవేత్తలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంటే.. వారికి పూర్తి అనుకూల వాతావరణం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.టాప్ కమ్యూనిస్ట్ నేతలను కలిసిన ప్రణబ్ నాలుగురోజుల పర్యటన నిమిత్తం చైనా వచ్చిన ప్రణబ్ బుధవారం గువాంగ్‌ఝౌ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి హు చున్‌హువాతో భేటీ అయ్యారు. గువాంగ్‌ఝౌ వచ్చిన ప్రణబ్‌కు చున్‌హువా విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చైనాలోని కేంద్రం-ప్రావిన్సులు, భారత్‌లోని కేంద్రం-రాష్ర్టాల మధ్య సంబంధాలపై వారు చర్చించారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు గుర్తుచేసుకొన్నారు. కాగా, భారత్ అమలుచేస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై చైనా అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆసక్తిగా ఉన్నదని భారత విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి జైశంకర్ మీడియాకు తెలిపారు. చర్చల్లో భాగంగా దేశంలో అమలవుతున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాల గురించి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు రాష్ట్రపతి ప్రణబ్ వివరించినట్లు జైశంకర్ వెల్లడించారు. అంతకుముందు భారతీయ బౌద్ధ సన్యాసి బోధిధర్మ స్మారకార్థం ఏర్పాటుచేసిన హువా లిన్ ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com