సినిమా రివ్యూ: ‘యానిమల్’.!

- December 01, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘యానిమల్’.!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించి, అదే సినిమాని ‘కబీర్ సింగ్’గా బాలీవుడ్‌లో రీమేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అక్కడ కూడా రికార్డులు కొల్లగొట్టాడు. ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ పాగా వేసేశాడు. తాజాగా ‘యానిమల్’ అంటూ అటు నార్త్‌నీ ఇటు సౌత్‌నీ కూడా ఒకేసారి టార్గెట్ చేశాడు ఈసారి. ఈ సినిమా ప్రమోషన్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయ్. నిజంగానే భారీ హైప్ క్రియేట్ అయ్యింది ప్రీ రిలీజ్ ప్రోమోస్‌తో ‘యానిమల్’పై. మరి, ఆ అంచనాల్ని ‘యానిమల్’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
రణ్విజయ్ సింగ్ (రణ్‌బీర్ కపూర్) ఇండియాలోనే అత్యంత ధనికుడైన బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కొడుకు. తండ్రి అంటే చిన్నప్పటి నుంచీ రణ్విజయ్‌కి పిచ్చ ప్రేమ. ఆ ప్రేమను తండ్రి అర్ధం చేసుకోకపోయేసరికి విపరీతమైన వింత ధోరణితో ప్రవర్తిస్తుంటాడు. చిన్నతనం నుంచీ అదే ప్రవర్తనతో పెరిగి పెద్దవాడవుతాడు. ఆ వింత ప్రవర్తన నచ్చని బల్బీర్ సింగ్ కొడుకును దూరం పెడతాడు. పెరిగి పెద్దవాడైన రణ్విజయ్ సింగ్ గీతాంజలి (రష్మిక మండన్నా)తో ప్రేమలో పడతాడు. తండ్రితో పాటూ, ఇంట్లో వాళ్లు కూడా రణ్విజయ్‌ని అర్ధం చేసుకోకపోవడంతో, భార్య గీతాంజలితో కలిసి అమెరికా వెళ్లిపోతాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తండ్రిపై హత్య యత్నం జరిగిందని తెలుసుకుని వాళ్ల భరతం పట్టేందుకు ఇండియాకి తిరిగొస్తాడు. తన తండ్రి మరణాన్ని చూడాలనుకున్న దుండగుల ఆట ఎలా కట్టించాడు.? వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు.? అన్నది మిగతా కథ. అది తెలియాలంటే ‘యానిమల్’ ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీ నటుల పని తీరు:
బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ చాలానే సినిమాలు చేశాడు. కొన్ని ప్రయోగాత్మక సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు. కానీ, ‘యానిమల్’తో సందీప్ రెడ్డి వంగా కొత్త రణ్‌బీర్‌ని చూపించాడు. నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు రణ్‌బీర్. లైఫ్ టైమ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వయెలెన్స్ వయెలెన్స్ వయెలెన్స్.. ఆ రకంగా డిజైన్ చేసిన ఆ హీరో పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. హీరోయిన్‌తో రొమాన్స్ చేసినా, అక్కతో చెడుగా ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పినా.. బావతో వాగ్వాదం చేసినా.. తండ్రిపై ప్రేమ చూపించినా.. నెక్స్‌ట్ లెవల్ వయెలెన్సే.. అదీ హీరో క్యారెక్టర్ ‘యానిమల్’ సినిమాలో. వామ్మో.! వాయ్యో.! అనేలా కొన్ని సీన్లలో రణ్‌బీర్ విలయ తాండవం చేసేశాడు. రష్మిక మండన్నా.. ఎప్పటిలాగే తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసేసింది. లవర్‌గా భార్యగా, కోడలిగా.. ఇద్దరి పిల్లల తల్లిగా పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఇక సినిమాకి హార్ట్ అండ్ సోల్ అయిన అనిల్ కపూర్ పాత్ర గురించి చెప్పాలంటే మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్ పాత్రనే ఇంకాస్త హైలైట్ చేసి చూపిస్తే బాగుండేదని వీక్షకుల అభిప్రాయం.

సాంకేతిక వర్గం పనితీరు:
‘యానిమల్’ సినిమాని ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పోల్చి చూశారు ప్రోమోస్‌ని బట్టి. అయితే, ‘అర్జున్ రెడ్డి’ కా బాప్.. అనొచ్చని సినిమా చూసిన తర్వాత ఫిక్సయ్యారు. బాబోయ్.! ఇదేం వయెలెన్స్ సందీప్ రెడ్డీ.! ఇంత దారుణంగా వయోలెన్స్‌ని చూపించొచ్చా.? ఎంత కఠినాత్ముడు, క్రూరుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అనిపించక మానదు. అందుకేనేమో ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టాడు. ఆ టైటిల్‌కి పక్కా యాప్ట్ ఈ సినిమా. కొన్ని సందర్భాల్లో బాబోయ్ ఈ వయొలెన్స్ తట్టుకోవడం మా వల్ల కాదంటూ కొందరు సాఫ్ట్ ఆడియన్స్ అభిప్రాయపడే సందర్భాలున్నాయ్. సీన్లు, డైలాగులు.. కొన్నిచోట్ల అదే అభిప్రాయాన్నిస్తాయ్. ‘అర్జున్ రెడ్డి’లోని వయొలెన్స్‌నే బాబోయ్ అనుకుంటే.. అంతకు మించిన వయొలెన్స్ చూపిస్తానని అప్పుడెప్పుడో సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మాట నిలబెట్టేసుకున్నాడీ సినిమాతో. ఇక, డైలాగులు,అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా వున్నాయ్. హర్ష వర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. ఇంతకు ముందెన్నడూ వినని ఆర్ఆర్‌తో సౌండింగ్ అదరగొట్టేశాడు. ‘నాన్న’ పాట ధియేటర్ నుంచి వచ్చాకా కూడా వెంటాడేస్తుంది.  అయితే, సినిమా లెంగ్త్ కాస్త ఓవర్ అనిపిస్తుంది. ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివి అంటే చిన్న విషయం కాదు.. సందీప్ రెడ్డి వయొలెన్స్ వరల్డ్‌లోకి వెళ్లిపోతే..ఆ వేవ్ లెంత్‌కి మ్యాచ్ అయిపోతే, ఆ నిడివి పెద్ద విషయం కాదనిపిస్తుంది. కానీ, ఏమాత్రం బోర్ ఫీలయినా.. సహనానికి పరీక్షే. ఓవరాల్‌గా సందీప్ రెడ్డి ‘యానిమల్’తో డైరెక్లర్ల యందు తన డైరెక్షన్ వేరయా.! అనిపించుకునేలా తనదైన విభిన్నమైన ముద్ర వేయించుకున్నాడు మరోసారి.

ప్లస్ పాయింట్స్:
తెలిసిన కథే అయినా.. కథనం నడిపించిన తీరు గ్రిప్సింగ్‌గా వుంది.  వయొలెన్స్ అంటే ఈ స్థాయిలో చూపించొచ్చా.? అనేంతలా ఒళ్లు గగుర్పొడిచే కొన్ని సన్నివేశాలు.. అనిల్ కపూర్, రణ్‌బీర్ మధ్య సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు.. అన్నింటికీ మించి రణ్‌బీర్ కపూర్ పర్‌ఫామెన్స్..

మైనస్ పాయింట్స్:
శృతి మించిన వయొలెన్స్.. భయానకం, భీకరం అనిపించే కొన్ని సన్నివేశాలూ, ఇబ్బందికరంగా అనిపించిన కొన్ని డైలాగులు.. అక్కడక్కడా కనిపించిన ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం.

చివరిగా:
బాబోయ్ వీడు ‘అర్జున్ రెడ్డి’ కాదు, అంతకు మించి నెక్స్‌ట్ లెవల్ ‘యానిమల్’.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com