కడలూరుకు చెందిన ఇద్దరు యువకులు 'ఐసిస్‌'లో...

- May 26, 2016 , by Maagulf
కడలూరుకు చెందిన ఇద్దరు యువకులు 'ఐసిస్‌'లో...

ఐఎస్‌ఐఎస్‌(ఐసిస్‌) ఉగ్రవాద సంస్థలో కడలూరుకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో దానిపై కడలూరు జిల్లా యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలను సేకరించడానికి రంగం సిద్ధం చేసింది. ఉగ్రవాద సంస్థలు తమిళనాడులోనూ కార్యకలాపాలు సాగించాలని కుట్రపన్నినట్లు పలు సందర్భాల్లో రుజువైంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తమిళనాడు పోలీసులు తరచూ అప్రమత్తమవుతూ ఉగ్రవాద జాడల్ని తుడిచిపెట్టేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట చెన్నైలో ఓ ఐఎస్‌ఐఎస్‌ ఏజెంట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్రంలోనూ ఐఎస్‌ఐఎస్‌ జాడలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. దీంతో మరికొందరు ఏజెంట్లు ఉండొచ్చనే అనుమానాలు తలెత్తడంతో వారిని గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. ఆ తర్వాత చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన ఇద్దరు యువకులు ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఐఎస్‌ఐఎస్‌ ప్రచార వీడియోలో 11 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించగా అందులో ఇద్దరు కడలూరు జిల్లా వాసులుగా తెలిసింది. దీని గురించి మళ్లీ తమిళనాడు పోలీసులను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. దీంతో ఆగమేఘాలపై ఆ ఇద్దరు యువకుల వివరాలను సేకరించడానికి సన్నద్ధమయ్యారు. నిఘా వర్గాలు తెలిపిన సమాచారం మేరకు నిందితులను కడలూరు జిల్లా పరంగిపేట్టైకు చెందిన కాజా ఫక్రుద్దీన్‌ ఉస్మాన్‌ అలి, గుల్‌ముహమదు మరక్కాచ్చి మరకాయర్‌గా గుర్తించారు. వారి కుటుంబం ఇంకా అక్కడే నివసిస్తున్న నేపథ్యంలో నిందితుల గురించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిపై ఇప్పటికే మలేషియాలో ఓ కేసు పెండింగ్‌లో ఉందని తెలిసింది. వీరిద్దరి వ్యవహారంలో తీసుకోనున్న చర్యల నిమిత్తం పోలీసు ఉన్నతాధికారుల సూచనలను జిల్లా పోలీసు యంత్రాంగం కోరినట్లు సమాచారం.పరంగిపేట్టైపై మరింత నిఘా కడలూర్‌ జిల్లా పరంగిపేట్టైలో ఐఎస్‌ఐఎస్‌, సిమీ ఏజెంట్లు ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇక్కడి యువకులను పలువురు మభ్యపెట్టి ఉగ్రవాద సంస్థలవైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలూ బలంగా వినిపించాయి. దీంతో అక్కడి అనుమానితులపై పోలీసులు కన్నేసిన నేపథ్యంలో తాజా ఘటన జిల్లా పోలీసు యంత్రాంగానికి కంటిమీద కనుకులేకుండా చేసింది. దీంతో మరింత కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుమానితుల పూర్తి వివరాలు, విదేశాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు, అక్కడ చేస్తున్న పని తదితర వివరాలను సేకరించాలనీ నిర్ణయించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com