తెలంగాణ ఎలెక్షన్లు: బీఆర్ఎస్ ఓటమికి 5 కారణాలుఇవే..

- December 03, 2023 , by Maagulf
తెలంగాణ ఎలెక్షన్లు: బీఆర్ఎస్ ఓటమికి 5 కారణాలుఇవే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటినుంచి అప్రతిహతంగా పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ను ప్రజలు తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టి బీఆర్ఎస్ పట్ల తమ అసహనాన్ని ఎత్తి చూపారు. ఈ ఓటమికి ముఖ్యమైన 5 కారణాలు ఇవే.. 

ధరణి పోర్టల్: ధరణి పోర్టల్ పేరుతో జరుగుతున్న దుర్మార్గాలు బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ కొట్టాయి. ధరణి పోర్టల్ వల్ల కౌలు రౌతులు, పోడురైతులు తీవ్రంగా నష్టపోయారు. భూస్వాములకే ఇది బాగా ఉపయోగపడిందన్న విమర్శులు ఉన్నాయి. చాలాచోట్ల ప్రజలకు పంచిన భూములు కూడా ధరణిలో ఆయా భూస్వాముల పేరుతో ఉండడం, రైతుబంధు కూడా వారికే అందుతున్న ఘటనలు ఉన్నాయి. ఏళ్ల తరబడి తమ పేరుమీదే ఉన్న భూములు పోర్టల్ లో వేరే వారి పేరుమీద చూపించడం తీవ్ర అసహనానికి గురిచేసింది. 

అవినీతి, అధికార దాహం: కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ లో పగుళ్లు రావడం అధికార పార్టీ అవినీతిని బట్టబయలు చేసింది. నాణ్యతా లోపాలను ఎత్తి చూపింది. దీనికి తోడు అన్ని ప్రాజెక్టులు, పథకాలు, పనుల్లో తీవ్రంగా పెరిగిపోయిన అవినీతితో ప్రజలు విసిగిపోయారు. మరోవైపు నాయకుల అధికార దాహం కూడా దీనికి ఒక కారణమే.

నిరుద్యోగ సమస్య: తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకు ఉపాధికి హామీ ఇచ్చిన ప్రభుత్వం గడిచిన పదేళ్లలో కూడా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేదు. పైగా నోటిఫికేషన్లు వేయకపోవడం, వేసిన వాటికి పేపర్లు లీకవడం, ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్‌సీ లీకేజి, గ్రూప్స్ ఎగ్జామ్స్ వాయిదా... గందరగోళం యువతలో అసహనాన్నిపెంచింది. ప్రతీ రంగంలోనూ ఉద్యోగాల సంఖ్య పెరగకపోగా, తగ్గిపోయింది. 

వనరుల దోపిడి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఇసుక మాఫియా విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు గనులలో దోపిడీ పెరిగింది. భూకబ్జాలు పెరిగాయి. బంగారు తెలంగాణ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ భూములను కబ్జా చేయడం. ప్రభుత్వ భూములను వేలం వేయడం లాంటివి ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచాయి. 

సంక్షేమ పథకాలు: దళితబంధు, షాదీ ముబారక్, బీసీబంధు, కౌలు రైతులకు చోటు లేని రైతుబంధు పథకాలు దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆయా పథకాల లబ్దిదారులు అధికార పార్టీల అనుచరులే కావడం తీవ్ర అసంతృప్తికి కారణం అయ్యింది. 

ఇక చివరగా స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రమంతా కాంగ్రెస్ వేవ్ ఉండడం ప్రాధానకారణం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com