సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం...తొలి సంతకం చేసిన ఫైల్స్ ఇవే

- December 07, 2023 , by Maagulf
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం...తొలి సంతకం చేసిన ఫైల్స్ ఇవే

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా తొలి సంతకం… రెండు ఫైళ్లపై చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు సంతకం చేశారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గటే… సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి… ముఖ్యమంత్రి హోదాలో రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. సంతకం చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పాలకులం కాదు సేవకులం అన్నట్లుగా పని చేస్తామని చెప్పారు. "ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాటిస్తున్నాను. నా తెలంగాణ కుటుంబ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా... ప్రగతి భవన్ లోకి రావొచ్చు. ప్రజలు వారి ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో రేపే ప్రజాదర్భార్ నిర్వహిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ్మ అండతో ప్రజలకు మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి చూపిస్తాం. పాలకులం కాదు సేవకులం అనే విధంగా పని చేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటాను" అని రేవంత్ రెడ్డి చెప్పారు.

"పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com