యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..

- December 10, 2023 , by Maagulf
యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..

లండన్: యూకేని ‘100 రోజుల దగ్గు’ వణికిస్తోంది. కోరింత దగ్గు రకానికి చెందిన  ఈ దగ్గు మూడునెలల పాటు కొనసాగుతోంది. జలుబుతో మొదలయ్యే ఈ దగ్గుని తేలికగా తీసుకోవద్దని.. తప్పనిసరిగా మాస్కులు వాడమని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.

యూకేని ఇప్పుడు కోరింత దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది. ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలైన దీనిని సాధారణ జలుబుగా పొరబడవచ్చు. ఆ తరువాత దగ్గు మొదలై దగ్గలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు కారణంగా గొంతులో పుండ్లు, చెవిలో ఇన్ఫెక్షన్లు ఓ దశలో మూత్రవిసర్జన ఆపుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాక్టీరియా కారణంగా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 3 లేదా 4 నిముషాల పాటు తీవ్రమైన దగ్గు రావడం వల్ల వాంతులు, లేదా పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం యూకేలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) నుండి ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ టెడ్డర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కోరింత దగ్గు గతేడాదితో పోలిస్తే 250 శాతం పెరిగిందని తెలుస్తోంది. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇంత తీవ్రమైన పరిస్థితి కనిపించలేదు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల్లో ఈ దగ్గు నివారించడానికి మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకాలు అవసరం అని NHS హెచ్చరించింది. గర్భిణీలు టీకాలు వేయించుకోవాలని .. తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలని పేర్కొంది. జూలై నుండి నవంబర్ మధ్య ఇంగ్లాండ్, వేల్స్ లో 716 మంది కోరింత దగ్గు బారిన పడ్డారు. 2022 తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com