ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు..

- December 28, 2023 , by Maagulf
ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు..

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. రోడ్లపై దృశ్యమానత సున్నాకి తగ్గింది. ఢిల్లీ ప్రజలను చలిగాలులు వణికించాయి. పొగమంచుతో రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాల రాకపోకల్లో ఆలస్యం జరిగింది.

దేశ రాజధానిలో పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా పలు రైళ్లు కూడా ఆలస్యం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, హర్యానా, చండీగఢ్,ఢిల్లీ, నైరుతి రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. నగరంలో చలిగాలుల తాకిడి మరోసారి నిరాశ్రయులైన ప్రజలను నైట్ షెల్టర్ల వైపు నడిపించింది. గురు, శుక్రవారాల్లో ఢిల్లీలో దట్టమైన పొగమంచు కప్పి ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది.

ఢిల్లీలో చలిగాలుల కారణంగా పాఠశాలల సమయాలు మారాయి. దేశ రాజధానికి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో వివిధ నగరాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఘజియాబాద్‌లో 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠశాలల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలీఘర్‌లో, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పరిధిలోని పాఠశాలలతో సహా 1 నుండి 12వ తరగతి వరకు అన్ని బోర్డుల కింద ఉన్న పాఠశాలలను గురువారం, శుక్రవారం మూసివేశారు.మథుర నగరంలో పాఠశాల తరగతుల సమయాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చారు. 1 నుంచి 8వ తరగతి వరకు జలాన్‌లోని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com