ఇండియా కూటమి కన్వీనర్‌గా మల్లికార్జున ఖర్గే

- January 13, 2024 , by Maagulf
ఇండియా కూటమి కన్వీనర్‌గా మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. ఇండియా కూటమికి చెందిన పార్టీల ముఖ్య నేతలు శనివారం వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కూటమిని మరింత బలోపేతం చేయడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమికి కన్వీనర్‌ నియామకం అంశాలపై వారు చర్చించారు. భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల పరిష్కారంపైనా సమావేశం దృష్టి సారించింది.

కూటమి అధినేత ఎంపిక విషయంలో ప్రతిపక్ష నేతలంతా తీవ్ర చర్చలు జరిపి.. ఖర్గేను చైర్‌పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయించారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయం ఇంకా తేలలేదు. సీట్ల పంపకాలపై నేతలు చర్చలు జరిపినప్పటికీ ఇంకా ఫైనల్‌ నిర్ణయం తీసుకోలేదు.

కాగా కూటమి కన్వీనర్‌గా బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను నేతలు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని పార్టీలు ఏకీభవిస్తేనే తాను కన్వీనర్‌గా ఉంటానని నితీష్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి కూటమి అధ్యక్షుడి పదివికి నితీష్‌ పోటీలో ఉండగా... కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎవరైనా ఆ బాధ్యతలు చేపడితే బాగుంటుందని నేటి భేటీలో ఆయన కోరినట్లు సమాచారం.

వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఈ భేటీలో పాల్గొనలేదు. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com