10వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఆంధ్ర సర్కారు

- June 01, 2016 , by Maagulf
10వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఆంధ్ర సర్కారు

ఆంధ్రపదేశ్‌లో మొత్తం 10వేల ఉద్యోగాలను తొలి దశలో భర్తీ చేయాలని రాష్ట్రమంత్రి మండలి నిర్ణయించింది. ఈ నెల 8న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మహా సంకల్పం బహిరంగ సభను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు ఉదయం విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. చంద్రన్న బీమా పథకం విధివిధానాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. ప్రమాదంలో మృతిచెందినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.5లక్షల వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు చెప్పారు.
ఈ పథకం పేదలకు వరప్రసాదం కానుందన్నారు. ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే రూ. రూ.3,62,500, సహజ మరణం సంభవిస్తే రూ.30వేలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.5లక్షల చొప్పున పరిహారం అందుతుందన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సున్న వారు, నెలకు రూ.15వేల కన్నా తక్కువ ఆదాయం కల్గినవారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఏడాదికి రూ.170ల బీమా ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

పోలీస్‌ పోస్టుల మినహా అన్ని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు. త్వరలోనే గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 నోటిఫికేషన్లు వెలవడనున్నాయన్నారు. అత్యధికంగా పోలీస్‌ శాఖలో 6వేల ఉద్యోగాలకు ప్రకటన వెలవరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఎయిడెడ్‌, మున్సిపల్‌ పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ నెల 20 నుంచి 30 వరకు, వచ్చే నెల 5 నుంచి 30 వరకు రాష్ట్రంలో పల్స్‌ సర్వే నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. 1.45 కోట్ల కుటుంబాలపై సోషియో ఎకనమిక్‌ డేటా సర్వే చేయనున్నట్లు చెప్పారు. గురువారం నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. జూన్‌ 27 నాటికి ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సీఆర్డీయే తీసుకోవాలని చంద్రబాబు స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com