ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..సెక్యూరిటీ రిస్క్!

- February 27, 2024 , by Maagulf
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..సెక్యూరిటీ రిస్క్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వైరస్‌లు, మాల్వేర్ల నుంచి ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. వీటి గురించి సైబర్ ఎక్స్‌పర్ట్స్ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేస్తుంటారు.

తాజాగా మరో మాల్వేర్‌ గురించి నిపుణులు ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లను అప్రమత్తం చేశారు. క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వారిని, ఆండ్రాయిడ్ ఎక్స్‌లోడర్ అనే మాల్వేర్‌ టార్గెట్‌ చేస్తోంది. ఇంతకుముందు కనుగొన్న ఓల్డర్ మాల్వేర్‌కు ఇది ఒక వేరియంట్. ఆండ్రాయిడ్ ఎక్స్‌లోడర్ SMS మెసేజ్‌లు యాక్సెస్ చేయగల ఫేక్ క్రోమ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేలా వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తుంది. వారికి తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది.

సెక్యూరిటీ రిసెర్చర్ కంపెనీ మెకాఫీ, ఆండ్రాయిడ్ ఎక్స్‌లోడర్ మాల్వేర్ ఎలా పని చేస్తుందో, దాని నుంచి ఎలా బయటపడాలో వెల్లడించింది. హానికరమైన లింక్‌ను కలిగి ఉన్న ఫిషింగ్ SMS మెసేజ్‌ల ద్వారా మాల్వేర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందని నివేదిక పేర్కొంది. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అంతే సంగతులు. మొదటగా దీనిపై క్లిక్ చేయగానే అది ఒక వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అక్కడ క్రోమ్ బ్రౌజర్ ముసుగులో కనిపించే ఓ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయమని ఓ ప్రాంప్ట్ అడుగుతుంది. దీనిని ఇన్‌స్టాల్ చేస్తే ప్రమాదంలో పడినట్లే.

డేంజరస్ మాల్వేర్

ఇది నిజమైన క్రోమ్ యాప్ కాదు. యూజర్ డివైజ్ నుంచి పర్సనల్ డేటాను దొంగిలించగల ఓ హానికరమైన మాల్వేర్. మాల్వేర్ ఆండ్రాయిడ్ కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను కూడా దాటి అటాక్ చేయగలదు. అలానే వినియోగదారుకు కనిపించకుండా వారి డివైజ్‌ల్లో దాక్కోగలదు.

ఈ మాల్వేర్ పాస్‌వర్డ్స్‌, ఫొటోలు, కాంటాక్ట్స్, డివైజ్ వివరాల వంటి సమాచారాన్ని సేకరించగలదు. మాల్వేర్ వెనుక ఉన్న హ్యాకర్లు ఈ సమాచారాన్ని హానికరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. కాబట్టి SMS మెసేజ్‌ల ద్వారా ఏవైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన ఎలాంటి APK ఫైల్ డౌన్‌లోడ్ చేయకూడదు.

మెకాఫీ ఆండ్రాయిడ్ ఎక్స్‌లోడర్ మాల్వేర్ గురించి గూగుల్‌ కి తెలియజేసింది. గూగుల్ దానిని ఇప్పటికే సర్వర్‌ల నుంచి తొలగించి ఉండవచ్చు.అయితే ప్లే స్టోర్ కాకుండా ఇతర సోర్సుల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండా యూజర్లను గూగుల్ ఆపలేదు. అందువల్ల, గూగుల్ యూజర్లు డివైజ్‌ల్లో ప్లే ప్రొటెక్ట్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

ప్లే ప్రొటెక్ట్‌తో ఆండ్రాయిడ్ ఎక్స్‌లోడర్ వంటి మాల్వేర్ బెదిరింపుల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉండవచ్చు. అలానే ఈమెయిల్, SMS, సోషల్ మీడియా యాప్స్ ద్వారా వచ్చే లింక్స్‌పై కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఈరోజుల్లో సైబర్ క్రిమినల్స్ మంచిగా నటిస్తూ ఇంటర్నెట్ యూజర్లను మోసం చేస్తున్నారు కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com