మధురలో గొడవలు.. పోలీసులతో సహా 21 మంది మృతి

- June 03, 2016 , by Maagulf

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ పార్కు వద్ద చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసుఅధికారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మధురలోని జవహర్‌బాగ్‌ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు.


పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.ఆక్రమణదారులు వద్ద కూడా ఆయుధాలు ఉండడంతో వారు కూడా పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో లాఠీ ఛార్జి ఆపేసి భాష్పవాయు గోళాలు ప్రయోగించామని, చివరకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఆక్రమణదారుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. వారిలో ఒకరు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి, మరో సీనియర్‌ అధికారి ఉన్నారు. ఘర్షణల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం, కాల్పుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మధురలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com