సినిమా రివ్యూ: ‘గామి’

- March 09, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘గామి’

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రోమోల పరంగా ఈ చిత్రం ఆసక్తి కలిగించింది. రెగ్యులర్ ఫార్మేట్‌కి భిన్నంగా ఇంట్రెస్టింగ్ కథా, కథనాలతో తెరకెక్కి సినీ ప్రియుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఆ ఇంట్రెస్ట్ సినిమా చూసిన ఆడియన్స్‌లో వుందా.? లేదా.? తెలియాలంటే ‘గామి’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
అఘోరా శంకర్ (విశ్వక్‌ సేన్) ఓ ఆశ్రమంలో వుంటుంటాడు. మానవ స్పర్శను తట్టుకోలేని ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంటాడు. అసలు శంకర్ అఘోరాగా ఎందుకు మారాల్సి వచ్చింది. అక్కడికి తాను ఎలా వచ్చాడు.? ఎందుకొచ్చాడు.? అంతకు ముందు తానెవరు.? అలాంటి జ్ఞాపకాలేమీ అతనికి తెలియవు. తనను తాను తెలుసుకోవడం కోసం.. అలాగే, తనకున్న అరుదైన వ్యాధిని మాపుకోవడం కోసం ఓ స్వామీజీ ద్వారా పరిష్కారం తెలుసుకుంటాడు. హిమాలయాల్లోని ద్రోణ గిరుల్లో 36 సంవత్సరాలకోసారి వికసించే మాలి పత్రాల్లో తనకున్న అరుదైన వ్యాధికి చికిత్స వుందని తెలుసుకున్న శంకర్, డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి)తో కలిసి అక్కడికి ప్రయాణం కడతాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కూతురు ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్)ల జ్ఞాపకాలు శంకర్‌ని వెంటాడుతుంటాయ్. కానీ, వాళ్లెవరో శంకర్‌కి గుర్తు రాదు. మరి, వాళ్తతో శంకర్‌కి వున్న సంబంధం ఏంటీ.? తన అన్వేషణలోని అనేక ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని శంకర్ తన వ్యాధికి చికిత్సను కనుగొన్నాడా.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ‘గామి’ ధియేటర్లలో చూడాల్సిందే.!

నటీనటుల పని తీరు:
లవర్ బోయ్‌గా మాస్ యూత్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌కి ‘గామి’ ఓ కొత్త ప్రయోగమే అని చెప్పొచ్చు. కొత్త పాత్రలో విశ్వక్ సేన్ ఆకట్టుకునే పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. ఛాందినీ చౌదరి డాక్టర్‌గా హీరోకి అండగా వుండే పాత్రలో తనదైన నటనా ప్రతిభ కనిబరిచింది. దేవదాసిగా అభినయ పాత్ర ఆకట్టుకుంటుంది. చిన్నారి హారిక తన వంతు పాత్రలో మంచి నటన చూపించి ఆకట్టుకుంది. అలాగే మహమ్మద్ తదితరులు తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు విధ్యాధర్ కాగిత ఓ మంచి కథను ఎంచుకుని విశ్వక్‌లాంటి హీరోతో ఆ కథను తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇలాంటి కథలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. అలాగే ప్రాణం పెట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు నరేష్ కుమరన్. ‘శివమ్’ పాట ధియేటర్లలో మోత మోగించేసింది. తక్కువ బడ్జెట్‌లోనే బీభత్సమైన గ్రాఫిక్స్ వర్క్ చూపించిన సినిమాటోగ్రఫర్ విశ్వనాధ్ రెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టీమ్ వర్క్ చాలా బాగుంది.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో విశ్వక్ సేన్ క్యారెక్టర్ పరిచయం చేయడం, అఘోరాలతో చేసే కుస్తీ యుద్ధ సన్నివేశాలు, దేవదాసీ వ్యవస్థను చూపించిన తీరు, మనుషులపై చేసే అకృత్యపు వైద్య ప్రయోగాల్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో డైరెక్టర్ తెరపై చూపించిన విధానం.. ద్రోణగిరి పర్వత శ్రేణుల్ని తెరపై ఆవిష్కరించిన విధానం.. ఇలా చాలా కొత్త అంశాలున్నాయ్ ఈ సినిమాలో.

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో చూపించిన వేగం సెకండాఫ్‌లో కాస్త సన్నగిల్లుతుంది. మళ్లీ క్లైమాక్స్‌లో జోరందుకుంటుంది.

చివరిగా:
కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘గామి’ ఖచ్చితంగా నచ్చుతుంది.. అని విశ్వక్ సేన్ రిలీజ్‌కి ముందు చెప్పిన మాటలు నిజమే. ‘గామి’లో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలు చాలానే వున్నాయ్. డిఫరెంట్ ఫీల్ గుడ్ మూవీ ఎక్స్‌పీరియన్స్ కోసం ‘గామి’ ధియేటర్లలో చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com