బాలసుబ్రహ్మణ్యం కు పుట్టినరోజు శుభాకాంక్షలు

- June 04, 2016 , by Maagulf
బాలసుబ్రహ్మణ్యం కు పుట్టినరోజు శుభాకాంక్షలు

అందరూ పాటలు పాడగలరు. కొందరు మాత్రమే హృదయానికి హత్తుకునేలా పాడగలరు. అలాంటి కొద్ది మందిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. 'తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి 'ఇది ఒకప్పటి సామెత. కానీ ఇప్పుడు గారెలు తిన్నా తినకపోయినా 'బాలు' పాట వినాలి. ఎందుకంటే ఆ పాట వెన్నెల రాత్రి మల్లెల మత్తులా.. సంక్రాంతి ముగ్గులా.. కన్నెపిల్ల సిగ్గులా.. గోదారి ఉప్పొంగులా ఉంటుంది.ఐదు దశాబ్దాలుగా తన మధురమైన గాత్రంతో శ్రోతలకు అమృతం పంచుతున్న గొప్ప గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. చక్కటి స్వరానికి స్వచ్ఛమైన భాషోచ్ఛారణకి మారుపేరు ఆయన.పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఏ వయస్సు వారినైనా ఇలాగే తన గానంతో ఆకట్టుకునే బాలు... 'పాట నన్ను విడిచి వెళ్లదు.. నేనూ పాటను విడిచి ఉండలేను' అని చెబుతుంటారు.శనివారం బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి...పాటల భాండాగారం! 1966 డిసెంబరు 15న విజయ గార్డెన్స్‌ రికార్డింగ్‌ స్టూడియోలో పీబీ శ్రీనివాస్‌, రఘురామయ్య, సుశీలగార్లతో కలిసి 'ఏమీ ఈ వింత మోహం' అంటూ తొలి పాట పాడారు బాలు. నాటి నుంచి నేటి వరకు ఆయన గళం నుంచి జాలు వారిన పాటల కుసుమాలు 39వేల పైచిలుకే ఉన్నాయి. 1980-81లో వచ్చిన 'ఏక్‌ దూజే కేలియా' చిత్రంతో హిందీలోనూ పాటలకు శ్రీకారం చుట్టారు. తొలి హిందీ చిత్రంతోనే జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇన్ని పాటలు ప్రపంచంలో మరెవ్వరూ పాడి ఉండరేమో! అంతేకాదు 1976-77ల్లో అమెరికా వెళ్లాల్సి వచ్చి... తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే రోజు మూడు, నాలుగు భాషల్లో 21 పాటలు పాడారట. అది ఆయన స్టామినా!సుమధుర గానానికి అవార్డుల మాల బాలు జీవితంలో 'శంకరాభరణం' మైలురాయి. 1979లో శంకరాభరణం, ఆ తర్వాత సాగరసంగమం, రుద్రవీణ, ఏక్‌ తుజే కేలియే(హిందీ) సంగీత సాగర శ్రీ గాన యోగి పంచాక్షరి(కన్నడ) మిస్సార కనవు(తమిళ) చిత్రాలకు గాయకుడిగా జాతీయ అవార్డులు లభించాయి. 2001లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' తోనూ, 2011లో 'పద్మవిభూషణ్‌'తోను సత్కరించింది. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ అందిస్తే, 2009లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదు ప్రదానం చేసింది. ఇంకా తమిళనాడు ప్రభుత్వం వారి 'కలైమామణి' పురస్కారం, బెంగుళూర్‌లో 'సంగీత గంగ' పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం 'రాజ్యోత్సవ ప్రశస్తి', చెన్నై సత్యభామ విశ్వ విద్యాలయం వారి గౌరవ డాక్టరేట్‌, జె.ఎన్‌.టి.యు. నుంచి గౌరవ డాక్టరేట్‌, లతా మంగేష్కర్‌ పురస్కారం పి. సుశీల జాతీయ పురస్కారం బాల సుబ్రమణ్యం కీర్తి కిరీటంలో కొన్ని అనర్ఘ మణులు మాత్రమే.చంద్రుడికో నూలుపోగులా ఇలా ప్రఖ్యాత అవార్డులెన్నో బాలుని వరించాయి. బీబీసీ రేడియో బాలుతో ముఖాముఖి నిర్వహించింది. ఇందులో దక్షిణాది కళాకారుడి ఇంటర్వ్యూ ప్రసారం కావడం తొలిసారి. ఇలాంటి ఘనత మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బాలూకే దక్కింది.నటనలోనూ ఆకట్టుకున్న ఆ'బాలు' గోపాలుడు బాలసుబ్రహ్మణ్యం కేవలం పాటలకే పరిమితం కాలేదు. ఆయనలోని మరోకోణాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు. 'పక్కంటి అమ్మాయి', 'ప్రేమికుడు', 'పవిత్ర బంధం' 'దేవుళ్లు', 'ఇంద్ర', 'శక్తి', తదితర ఎన్నో తెలుగు చిత్రాల్లోనే కాకుండా అటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలు చిత్రాల్లోని పాత్రలకు ఆయన చెప్పిన డబ్బింగ్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా 'అన్నమయ్య' చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించిన సుమన్‌కు చెప్పిన డబ్బింగ్‌ ఆ వైకుంఠ వాసుడే మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
పాటే జీవితంగా.. జీవితమే పాటగా మలుచుకున్న బాలు గురించి... * ఎదుటివారిలో ఇష్టపడేది: సింప్లిసిటీ * అమితంగా ప్రేమించేది: సంగీతం * ఆస్తి: స్నేహితులు * వీక్‌నెస్‌: 'నో' అని చెప్పలేకపోవడం * ఇబ్బంది పడే క్షణాలు: అవతలివాళ్లు పొగుడుతుంటే * బాధించేది: లేనివాళ్ల ఆకలి * ఎదుటివారిలో ఆకర్షించేది: చిరునవ్వు * మరచిపోవాలి అనుకునేది: నేను బాగా పాడాలేని పాటలు * నా భార్యలో నాకు నచ్చిన గుణం: సంగీతం గురించి మాట్లాడక పోవడం * ఇష్టమైన వంటకం: కందిపచ్చడి * ద్వేషించేది: ద్వేషాన్ని * ఇష్టమైన చిత్రాలు: సాగరసంగమం, బంగారుపాప, దొంగరాముడు, శ్రీనాథకవిసార్వభౌముడు, మదర్‌ ఇండియా, అర్థ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com