అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- March 31, 2024 , by Maagulf
అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూ ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేసారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ ఈ అవార్డుని అందించారు. వయసు రీత్యా ఆయన బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇలా ఆయన ఇంట్లోనే అవార్డు ప్రదానం చేయాల్సి వచ్చింది.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. అద్వానీ పక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. ఎల్‌కే అద్వానీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అధికారికంగా ఆయనకు ఆ అవార్డుని బహుకరించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీకి గత ఫిబ్రవరిలో కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌, మాజీ ప్రధానమంత్రులు పీవీ నర్సింహారావు, చౌదరీ చరణ్‌ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. పీవీ తరపున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు భారతరత్నను స్వీకరించారు. చరణ్‌ సింగ్‌ తరపున ఆయన మనుమడు జయంత్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకూర్‌ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ పురస్కారాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ , కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com