సినిమా రివ్యూ: ‘ఫ్యామిలీ స్టార్’.!
- April 05, 2024హిట్టు కాంబో అయిన పరశురామ్, విజయ్ దేవరకొండల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘ఫ్యామిలీ స్టార్’. టైటిల్‌ని బట్టి, ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని భావించి నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. కానీ, ఊహించినట్లుగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ‘ఫ్యామిలీ స్టార్’ అలరించిందా.? లేదా.? తెలియాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథేంటో తెలియాల్సిందే.!
కథ:
సివిల్ ఇంజనీర్ అయిన గోవర్ధన్ (విజయ్ దేవరకొండ)కు ఫ్యామిలీ అంటే ప్రాణం. ఇద్దరు అన్నయ్యలూ, వదినలూ, వారి పిల్లలూ ఓ బామ్మ.. ఇలా కుటుంబం పెద్దదే. కానీ, అన్నయ్యలు ఇంకా సెటిల్ కాకపోవడంతో, కుటుంబానికి అంతా తానై బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంటాడు. మిడిల్ క్లాస్ లైఫ్ అనుభవిస్తూ.. ఓ సిస్టమేటిక్‌గా వుంటాడు. కుటుంబం కోసం తనను ప్రేమించిన అమ్మాయిని సైతం కాదంటాడు. అలాంటి సిస్టమేటిక్ లైఫ్ ఫాలో చేస్తున్న గోవర్ధన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తుంది. చూడగానే ఇందుతో ప్రేమలో పడతాడు గోవర్ధన్. వన్ ఫైన్ డే ఇందుకి తన ప్రేమను చెప్పాలనుకున్న టైమ్‌లో ఇందు గురించి ఓ షాకింగ్ విషయం తెలుసుకుంటాడు గోవర్ధన్. అది తెలుసుకున్న గోవర్ధన్, ఇందుని అసహ్యించుకుంటాడు. ఇంతకీ ఆ విషయం ఏంటీ.? మరి, అసలు నిజం తెలుసుకున్న గోవర్ధన్ చివరికి ఇందుని అర్ధం చేసుకుంటాడా.? ఆమె ప్రేమను దక్కించుకుంటాడా తెలియాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పని తీరు:
అంత పెద్ద ఫ్యామిలీ బాధ్యతల్ని తన భుజాలపై మోసే ఓ మధ్య తరగతి కుర్రోడిలా విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడు. నిజంగా చెప్పాలంటే కొంత వరకూ తానే ఈ సినిమాని కూడా మోశాడనిపిస్తుంది. అయితే, మధ్యలో సడెన్‌గా గాడి తప్పేస్తుంది. విజయ్ దేవరకొండ తన వంతుగా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. కానీ, కథ, కథనంలోని బలహీనతలు.. విజయ్‌ని సైతం చేతులెత్తేసేలా చేశాయ్. ‘హాయ్ నాన్న’ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ని చూశాకా ఆమె నుంచి ఈ సినిమాలో ఇంకా ఎక్కువే ఎక్స్‌పెక్ట్ చేస్తాం సహజంగా. కానీ, నిరాశే మిగిలింది ఆమె పాత్రలో. మంచి డెప్త్ వున్నప్పటికీ, మూతి ముడిచుకుని కూర్చోబెట్టేశాడు డైరెక్టర్. మొదటి పార్ట్‌లో సో సో అనిపించిన మృణాల్ పాత్ర సెకండ్ పార్ట్‌లో మరీ బోర్ కొట్టించేస్తుంది. మృణాల్ పాత్రే కాదు, ఈ సినిమాలో అన్ని పాత్రలకూ మంచి స్కోప్ వుంది. కానీ, ఎక్కడా వాడిన పాపాన పోలేదు డైరెక్టర్ పరశురామ్. అన్నయ్యలు రవి ప్రకాష్, రాజా, వదినలు అభినయ, వాసుకి, వెన్నెల కిషోర్, ప్రబాస్ శీను.. ఇలా మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించి మెప్పించారని చెప్పలేం.. నిరాశ పరిచారనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పని తీరు:
ఇలాంటి సినిమాలకు మ్యూజిక్ ప్రధానాంశం. ప్రేక్షకుడ్ని కట్టిపడేయాలి. అలాంటిది గోపీసుందర్ మ్యూజిక్ కంప్లీట్‌గా మైనస్ అయ్యింది. మృణాల్ వంటి బ్యూటిఫుల్ హీరోయిన్‌ని పట్టుకుని, విజయ్ వంటి ఓ రొమాంటిక్ హీరోతో డ్యూయెట్ చేయించాలన్న ఆలోచన కూడా రాలేదా డైరెక్టర్‌కి.? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్ ప్రేక్షకుల నుంచి. పాట.. అని చెప్పుకోదగ్గ ‘కళ్యాణి వచ్చిందమ్మా..’ పాటను టైటిల్స్‌లో పెట్టి వేస్ట్ చేశాడు. యాక్షన్ సీన్లలోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. మోహనన్ సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కథను హైద్రాబాద్ నుంచి, అమెరికాకి తీసుకెళ్లిపోయాడు.. కానీ, విజువల్స్ ఎక్కడా హైలైట్ కాలేదు. ఎడిటింగ్‌కి అయితే, పెద్ద పనే పెట్టాలి. చాలా సీన్లు ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో వచ్చే ఎమోషనల్ సీన్లు బాగా సాగతీతగా తోస్తాయ్. ఎక్కడా ఎమోషన్ కనెక్ట్ కాదు. దాదాపు మూడు గంటల నిడివి వున్న సినిమాలో ఎక్కడా వావ్ అనిపించే ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. పెట్టిన ఖర్చుకు తగ్గ విజువల్ వర్త్ కనిపించదు.
డైరెక్టర్ విషయానికి వస్తే, పరశురామ్ నుంచి ఇలాంటి ఓ సినిమా.. అదీ విజయ్ దేవరకొండతో అస్సలూహించలేం. ఇలాంటి ఫ్యామిలీ తరహా సినిమాలకుండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా ఫ్యామిలీ స్టార్ సినిమాలో లేకపోవడం ఆశ్చర్యకరం. లాజిక్కుల్లేని కథ.. అస్సలు అతకని సన్నివేశాలూ.. ఆశించిన వినోదం.. ఆహ్లాదమైన మ్యూజిక్.. ఇలా ఏ ఒక్కటీ ఈ సినిమాని నిలబెట్టాల్సిన అంశాల్లో లేకపోవడం మరింత నిరాశపరిచే అంశం. గెస్ట్ రోల్ చేసిన రవిబాబును సైతం డైరెక్టర్ వాడలేకపోయాడంటేనే అతని ఫోకస్ సినిమాపై ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. సీరియస్ సబ్జెక్ట్ అయిన ‘సోలో’ వంటి సినిమాని ఎంతో వినోదాత్మకంగా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా నడిపించిన పరశురామ్ ‘ఫ్యామిలీ స్టార్’తో రైటర్‌గా డైరెక్టర్‌గా పూర్తిగా ఫెయిలయ్యాడు. పాపం విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలనుకున్నాడు. కానీ, మళ్లీ అన్యాయం జరిగింది.
ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ పర్‌ఫామెన్స్ (వన్ మ్యాన్ షో కొంతవరకూ) ఫస్టాఫ్‌లో కొన్ని మిడిల్ క్లాస్‌కి కనెక్ట్టింగ్ సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్:
వీక్ కథ, లాజిక్ లేని కథనం, వర్త్ వున్నప్పటికీ ఆర్టిస్టులనెవ్వరినీ వాడలేకపోవడం.. సెకండాఫ్‌లో సాగతీత అంశాలు
చివరిగా:
‘ఫ్యామిలీ స్టార్’. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఓ క్లీన్ మూవీ.. కానీ, హై ఓల్టేజ్ ఫన్ వుండుంటే, ఖచ్చితంగా ఆకట్టుకునేదే.!
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!