దాసరి నారాయణరావు పేరిట ‘దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్’

- April 11, 2024 , by Maagulf
దాసరి నారాయణరావు పేరిట ‘దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్’

హైదరాబాద్: 150కి పైగా సినిమాలు తీసి దర్శకరత్నగా నిలిచారు దాసరి నారాయణరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు గాను దాసరి నారాయణరావు జయంతి మే 4న డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. తాజాగా పలువురు సినీ ప్రముఖులు ఆయన పేరుపై ఆయన జయంతి వేడుకలు జరిపించి దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ పేరిట సినిమాలోని పలు రంగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందించాలని నిశ్చయించారు.

డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయనతో అనుబంధం కలిగిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సి.కళ్యాణ్, సూర్యనారాయణ, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీలు కమీటీగా ఈ వేడుకని నిర్వహించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మే 5న ఈ వేడుక నిర్వహించనున్నట్టు నేడు ప్రెస్ మీట్ ద్వారా తెలియచేసారు.

దాసరి జ్ఞాపకార్థం అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న.. ఇలా పలు అవార్డుని ప్రదానం చేయనున్నట్టు తమ్మారెడ్డి తెలిపారు. దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు, కరోన వల్ల కంటిన్యూ చేయలేకపోయమని, ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం అని ప్రెస్ మీట్ లో సూర్యనారాయణ తెలిపారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… దురదృష్టవశాత్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి, పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమయంలో మహానుభావుడైన దాసరి నారాయణ పేరిట అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయం అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com