రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం.. సీఎం రేవంత్ రెడ్డి

- April 16, 2024 , by Maagulf
రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం.. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేసామని తెలిపారు. గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువ మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని గుర్తు చేశారు.

 “ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.గల్ఫ్ మరియు ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు  అధ్యయనం చేస్తున్నాం.ఇందు కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.

ఫిలిప్పీన్ విధానాలను మేం స్పష్టంగా అధ్యయనం చేసాం.ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసాం.ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మరోసారి గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమవుతాము.పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాం.ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నము.ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. 

గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాం.” అని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com