ITలో 64వేల ఉద్యోగాలు ఫట్
- April 20, 2024న్యూఢిల్లీ: భారత దేశంలోని దిగ్గజ ఐటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల కుదింపునకు పాల్పడ్డాయి. ఇటీవల స్టార్టప్ నుంచి పెద్ద కంపెనీల వరకూ తేడా లేకుండా దాదాపు అన్నింటిలోనూ ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. ఉన్న ఉద్యోగులు మానెయ్యడం లేదా తొలగించబడిన స్థానాల్లో ఆయా సంస్థలు కొత్త వారిని తీసుకోవడం దాదాపు మానేశాయి. అగ్రశ్రేణి మూడు ఐటి కంపెనీల్లో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 64,000 మంది పైగా సిబ్బందిని కుదించుకున్నాయి. వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ పొదుపు చర్యల్లో భాగంగా తొలగింపులకు పాల్పడటం గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడుతుండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల్లో 64వేల పైగా ఉద్యోగులు తగ్గారు. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టిసిఎస్‌లో ఒక్క ఏడాదిలోనే 13,249 మంది ఉద్యోగులు తగ్గి.. 2024 మార్చి ముగింపు నాటికి 6,01,546కు కుదించబడ్డారు. రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య 3,43,234 నుంచి 3,17,240కి క్షీణించింది. ఈ కంపెనీలో ఏడాదిలోనే 25,994 మంది కోత పడ్డారు. మరో దిగ్గజ ఐటి కంపెనీ విప్రోలో 2023 మార్చి ముగింపు నాటికి 2,58,570 మంది సిబ్బంది ఉండగా.. ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి 2,34,054కు కుదించబడ్డారు. దీంతో ఒక్క ఏడాదిలోనే 24,516 మంది ఉద్యోగులు తగ్గారు.
దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో పెద్దగా డిమాండ్ లేకపోవడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఐటి సర్వీసులకు గిరాకీ తగ్గింది. మరోవైపు అన్ని కంపెనీలు పొదుపు చర్యలకు దిగినట్లే ఐటి సంస్థలు అదే బాటలో నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఐటి కంపెనీలకు ప్రధానంగా బ్యాంక్‌లు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌లు తమ సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అత్యవసరం అయితే తప్పా మార్పులు చేపట్టడం లేదు. ఇది ఐటి కంపెనీల నియామకాలపై కొంత ప్రభావం చూపుతోంది.
ఐటి, బిపిఒ, విద్యా, రిటైల్, వైద్య తదితర రంగాల్లో ఉద్యోగాల సృష్టిలో మందగమనం చోటు చేసుకుంటుందని ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఏడాదికేడాదితో పోల్చితే 2023 డిసెంబర్‌లో నైపుణ్యవంతుల ఉద్యోగ (వైట్ కాలర్) నియామకాల్లో ఏకంగా 16 శాతం క్షీణత చోటు చేసుకుందని నౌక్రీ.కమ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ ఇటీవల వెల్లడించారు. ఐటి నియామకాల్లో పూర్తి రికవరీ కోసం దీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. బిపిఒ, విద్యా, రిటైల్, వైద్యం వంటి రంగాల్లో నియామక విశ్వాసాలు తగ్గాయని నౌక్రీ.కమ్ వెల్లడించింది. ఆయా రంగాల్లో రిక్రూట్‌మెంట్స్ వరుసగా 17 శాతం, 11 శాతం, 11 శాతం, 10 శాతం చొప్పున క్షీణతను చవి చూశాయి. ఐటి రంగం నియామకాల్లో ఏకంగా 21 శాతం పతనం చోటు చేసుకుందని తెలిపింది. మరోవైపు కొత్త ఉద్యోగాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. లక్షల రూపాయలు పోసి టెక్ చదువులు పూర్తి చేసిన వారిలో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో దేశంలో నైపుణ్యవంతుల నిరుద్యోగం పెరుగుతోంది.
తాజా వార్తలు
- Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!
- KD500లకు రెసిడెన్సీ విక్రయం..ఇద్దరు అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో 121% పెరిగిన టూర్ గైడ్ లైసెన్స్లు..!!
- అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!
- యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- డిస్నీల్యాండ్ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!