దిల్ రాజు - త్రివిక్రమ్ లు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు..

- June 07, 2016 , by Maagulf
దిల్ రాజు - త్రివిక్రమ్ లు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు..

అటు ప్రేమ కథలు ఇష్టపడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలను రూపొందించుకుని, వాటిని చక్కటి చిత్రాలుగా మలచటంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది అందెవేసిన చేయి. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 'అ.. ఆ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. మరోవైపు దిల్ రాజు నిర్మించే చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటై ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీని గురించి దిల్ రాజు మాట్లాడుతూ ''త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నాకు 'నువ్వే కావాలి' సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం.
ఇప్పుడు మా బ్యానర్‌లో ఆయనతో ఒక భారీ సినిమా తేయబోతున్నాం. ఒక పెద్ద స్టార్ హీరోతో ఈ చిత్రం ఉంటుందని, ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం'' అని ఆయన తెలిపారు. అ..ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, "జూన్‌లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు. అటువంటి ట్రెండ్‌ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. కేవలం ఒక వారంలో డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ జరగలేదు. ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్‌కి, నిర్మాత చినబాబు గారికి నా అభినందనలు" అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com