జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

- April 24, 2024 , by Maagulf
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు అందించడంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో స్థానిక సంస్థలే కీలక భాగస్వామ్యం వహిస్తున్నాయి.1993 ఏప్రిల్‌ 24నుంచి ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో లార్డ్‌రిప్పన్‌ తీర్మానంలో స్థానిక స్వపరిపాలన ఆవశ్యకతను ప్రస్తావించారు.గ్రామస్వరాజ్యం కావాలంటూ మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటారు.స్వాతంత్ర్యానంతరం బల్వంతరాయ్‌ కమిటీ సిఫారుసుల ఆధారంగా మూడెంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌ గుర్తింపు పొందింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో 1959లో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పంచాయతీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.

1959 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పాలన ప్రారంభమై దేశంలో రెండోస్థానం దక్కించుకుంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా షాద్‌ నగర్‌లో స్థానిక పాలనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1986లో బ్లాక్‌ స్థాయి వ్యవస్థను మండల పరిషత్‌గా మార్చారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పటిష్టమైంది. ఈ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి ఏప్రిల్‌ 24న పంచాయ తీరాజ్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991లో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్‌ 1992లో ఆమోదించింది. 17 రాష్ట్రాల ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌శర్మ ఈ బిల్లుపై 1993, ఏప్రిల్‌ 20న తొలి సంతకం చేశారు. అది ఏప్రిల్‌ 24నుంచి అమల్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 73వ రాజ్యాంగ సవరణ మేరకు నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని 1994లో రూపొందించింది. ఈ చట్టంలో మొత్తం 8 అధ్యాయాలు 278 సెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి నుంచి రెండో సెక్షన్‌లు చట్టం గురించి వి వరణ పరిధిని తెలియజేస్తాయి. 3నుంచి 147 వరకు సెక్ష న్‌లు గ్రామ పంచాయతీలకు వర్తిస్తాయి. 148 నుంచి 199 సెక్షన్‌లు మండల పరిషత్‌లకు జిల్లా పరిషత్‌లకు వర్తి స్తాయి. 200 నుంచి 242 సెక్షన్‌లు పంచాయతీ సంస్థలకు ఎన్నికల నిర్వహణ గురించి తెలియజేస్తాయి. 242ఏ నుంచి 242ఐ సెక్షన్‌లు షెడ్యూల్‌ ప్రాంతాల్లో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రత్యేక ని బంధనలు 243 నుంచి 278 సెక్షన్‌లు ఇతర అంశాల గు రించి తెలియజేస్తాయి.

ఆదేశిక సూత్రాల్లో ఉన్న 40వ రాజ్యాంగ అధికరణను, 73వ రాజ్యాంగ సవరణతో అమలులోకి తెచ్చారు. రాష్ట్రాలు గ్రామపంచాయతీల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, స్థానిక ప్రభుత్వాలుగా అవి పనిచేయాలని స్పష్టం చేశారు. అవసరమైన అధికారాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక సంక్షేమం, మార్కెట్‌-ప్రదర్శనలు, కుటుంబ సంక్షేమం, గ్రంథాలయాలు, సాంకేతిక శిక్షణ-వృత్తి విద్య, దారిద్య్ర నిర్మూలన, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామీణ గృహ నిర్మాణం, చిన్నతరహా పరిశ్రమలు, సామాజిక వనాలు-అటవీ పెంపకం, భూ అభివృద్ధి, పశు పోషణ-సంరక్షణ, పాల ఉత్పత్తి, కోళ్ల పెంపకం, సామాజిక వనరులు, ఆస్తుల పరిరక్షణ, బలహీన వర్గాలు, తెగలు, మహిళలు, శిశువుల సంక్షేమం, ఆరోగ్యం-పారిశుద్ధ్యం, వ్యవసాయం, విద్య వంటి 29 అంశాలను పంచాయతీలకు బదలాయించాల్సి ఉంది.

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య పోటీ తత్వంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పరంపర కొనసాగుతూనే ఉంది. గ్రామ పరిపాలనలో సాధించిన విజయాలతో జిల్లాస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పలు రకాల అవార్డులు, రివార్డులతో ఏటా స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తారు.  

               --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com