అతి తెలివి పిల్లి పిల్లలు

- July 01, 2015 , by Maagulf
అతి తెలివి పిల్లి పిల్లలు

అనగనగా ఒక గండు పిల్లి ఉండేది. దానికి రెండు పిల్లలున్నాయి. అవి రెండూ ఎప్పుడూ ఒకదానికొకటి కొట్టుకుంటూ, సోమరిపోతుల్లా తిని తిరుగుతూ ఉండేవి. తమ తల్లి వాటికి వేటాడడం నేర్పిస్తాను. నాతో రండి అని ఎంత చెప్పినా మాట వినేవి కావు. దాంతో వాటికి అలాగే సోమరితనం అలవాటయిపోయింది. తల్లి వేటాడి తెచ్చిన ఆహారం తింటూ హాయిగా కాలం గడిపేస్తూ ఉన్నాయి. కొన్నాళ్లకి తల్లి పిల్లికి జబ్బు చేసి మంఛం పట్టేసింది. దాంతో పిల్లలు వేటకి వెళ్లక తప్పలేదు. తల్లి పిల్లలతో జాగ్రత్త నాయనా మీకు వేటాడడం అస్సలు రాదు. ఎలా వెళ్తారు? అని అడుగగా.. అందుకా పిల్లలు నీకే వేటాడడం వచ్చా? ఆ మాత్రం పని మేమూ చేయగలం చూద్దువుగానీ ఉండు అని తల్లి చెప్పిన మాట వినకుండా వేటకు బయల్దేరాయి. అలా వెళ్తుండగా దారిలో వారికి ఒక ఎలుక కనిపించింది. ఆ విషయాన్ని అందులో ఒక పిల్లి రెండో పిల్లికి చెప్పింది. వెంటనే ఆ రెండో పిల్లి ఆ ఎలుక దగ్గరకు వెళ్లి అమాంతం దాని తోక పట్టుకుని దాన్ని కదలనీయకుండా చేసి, చూశావా నేను ఎలా పట్టేశానో. అందుకే నీ కన్నా నేనే గొప్ప అని అంది. ఇంతలో ముందు ఆ ఎలుకను నేనే చూపించాను కాబట్టి నేనే నీకంటే గొప్పదాన్ని అని ఇంకో పిల్లి అంది. ఇదంతా చూస్తూ దాని ప్రాణం పోయినట్టే ఇక అనుకుని భయపడుతున్న ఎలుకకి వీళ్ల తెలివితేటల గురించి తెలిసి ఎలాగైనా వీళ్ల నుంచి తప్పించుకోవాలని ఆ రెండు పిల్లి పిల్లలతో ఇలా అంది. మీలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలంటే నేనొక ఉపాయం చెప్తాను వినండి అని మీలో ఎవరైతే ముందుగా ఆ గోడను ముట్టి మళ్లీ నన్ను పట్టుకుంటారో వాళ్లే గొప్ప అని ఎదురుగా ఉన్న ఒక గోడను చూపించి చెప్పింది. ఇంకా ఎలుక మాట పూర్తి కాకుండానే ఆ రెండు పిల్లులు చటుక్కున గెంతి ఆ గోడను ముట్టుకోవాలని పరుగెత్తాయి. ఇంతలో ఎలుక చెంగున ఎగిరి దగ్గరలో ఉన్న పొదల్లోకి దూరి తప్పించుకుంది. జరిగిన దానికి వాటి తెలివి తక్కువతనానికి సిగ్గుపడి, దొరికిన ఆహారాన్ని చేజార్చుకున్నందుకు బాధపడుతూ నీరసంగా ఆ రెండు పిల్లులు ఇంటి దారి పట్టాయి. కథ కంచికి మనం ఇంటికి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com