అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్‌

- April 25, 2024 , by Maagulf
అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్‌

న్యూఢిల్లీ: భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అమెరికా రిపోర్ట్‌ను భారత్‌ గురువారం తిరస్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ వారంలో నిర్వహించే మీడియా సమావేశంలో ఈ నివేదికపై మీడియా ప్రశ్నించింది. ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని, దేశంపై సరైన అవగాహన లేదనడానికి నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. ఆరిపోర్టుకు ఎటువంటి విలువ లేదని, మీరు కూడా పట్టించుకోవద్దని మీడియాకు సూచించారు.

గతేడాది మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తర్వాత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ”2023 కంట్రీ రిపోర్ట్స్‌ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రాక్టీసెస్‌: ఇండియా ” పేరిట ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. మైతేయి, కుకీ కమ్యూనిటీల మధ్య చెలరేగిన ఘర్షణలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆ నివేదికలో పేర్కొంది.  ఈ ఘటనను ప్రధాని మోడీ సిగ్గు చేటని అభివర్ణించడంతో పాటు నివేదికపై విచారణకు ఆదేశించారని పేర్కొంది.  జమ్ముకాశ్మీర్‌లో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు విచారణను ఎదుర్కొన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com