రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్‌ కోట' ధ్వంసం..!

- May 01, 2024 , by Maagulf
రష్యా క్షిపణి దాడిలో \'హ్యారీపోటర్‌ కోట\' ధ్వంసం..!

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోట(Harry Potter Castle)గా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది.

ఇందుకోసం ఇసికందర్‌ క్షిపణిపై క్లస్టర్‌ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 20 భవనాల వరకు దెబ్బతిన్నాయి. ఈ దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ విడుదల చేశారు. దీనిలో ఓ సుందర భవనం అగ్నికీలల్లో దహనమవుతున్న దృశ్యాలున్నాయి.

మరోవైపు క్రిమియాలోని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌కు చెందిన ఆయుధాలున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు 10 డ్రోన్లు కూడా ఉన్నాయన్నారు.

మరోవైపు ఖర్కీవ్‌ నగరంలోని ఓ రైల్వే లైన్‌పై రష్యా గైడెడ్‌ బాంబ్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం.

ఇక రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ నుంచి తప్పించుకొని 97 ఏళ్ల వృద్ధురాలు తమ ప్రాంతానికి వచ్చిందని ఉక్రెయిన్‌ సైన్యం చెప్పింది. ఆమెపేరు స్టెపనోవాగా వెల్లడించింది. ఫిరంగి గుళ్ల దాడిని తప్పించుకొంటూ దాదాపు 10 కిలోమీటర్ల మేర కాలినడకన ఆమె ప్రయాణించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com