అల్టిమేట్ స్టార్...AK

- May 01, 2024 , by Maagulf
అల్టిమేట్ స్టార్...AK

భారత చలన చిత్ర రంగంలో ఉన్న ప్రముఖ నటుల్లో ఒకరు అజిత్ కుమార్. అజిత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయ చేయాల్సిన అక్కర లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. .19 ఏళ్ల వయసులోనే చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ సౌత్ సూపర్ స్టార్ అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. అభిమానులు అల్టిమేట్ స్టార్ గా , బాక్సాఫీస్ కింగ్ గా, ఏకే గా , తలా (అన్న) గా పిలుచుకునే అజిత్ కుమార్ పుట్టిన రోజు నేడు.

అజిత్ కుమార్ 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో సుబ్రమణి, మోహిని దంపతులకు జన్మించారు. ఆరోజుల్లో అజిత్ తండ్రి సుబ్రమణి సికింద్రాబాద్‌లోని ఫార్మసీ కంపెనీలో పనిచేశారు. ఆతర్వాత తండ్రికి ఉద్యోగ బదిలీ కావడంతో వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. అజిత్ కు చిన్నతనం నుంచి చదువు కన్నా గేమ్స్ , బైక్స్ , కార్లంటే మక్కువ. ఆ మక్కువ కారణంగానే  పదోవ తరగతి పూర్తి చేయలేకపోయారు.

ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ షో రూమ్ లో అప్రెంటిస్ మెకానిక్‌గా పని చేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే అజిత్ మోడలింగ్, చేయడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు తిరుప్పూర్ లో గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. అయితే, తనకిష్టమైన ఆటోమొబైల్స్ మీద ఎక్కువ దృష్టి సారించడం మూలంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీని సరిగ్గా నడపక భారీ నష్టంతో దివాళా తీయడం జరిగింది.

గార్మెంట్స్ లో వచ్చిన నష్టాలను పూడ్చేందుకు అజిత్ బైక్ రేసింగ్స్ , మోడలింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ అజిత్ ను గుర్తించి.. సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. 1990లో వచ్చిన  ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ చిత్రంతో అజిత్ సినిమా కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో అజిత్  ఓ చిన్న పాత్రలో నటించారు.

అజిత్ స్నేహితుడైన ఎస్పీబీ చరణ్ తండ్రి దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్‌తో ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో " ప్రేమపుస్తకం" అనే తెలుగు చిత్రంలో తొలిసారిగా హీరోగా నటించారు. ఈ సినిమా కోసం అజిత్ తన పేరును శ్రీకర్ గా మార్చుకున్నాడు. అయితే, దర్శకుడు శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో అతని తండ్రి గొల్లపూడి మారుతీ రావు సినిమాకు దర్శకత్వం వహించి 1993 లో ఇది విడుదలైంది. అజిత్ కెరీర్ లో తెలుగు చిత్రంగా ప్రేమపుస్తకం నిలిచిపోయింది.

ప్రేమపుస్తకం చేస్తున్న సమయంలోనే కోలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ పోయారు . 1993లో ‘అమరావతి’ చిత్రంతో మొదలై 1995 వరకు పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ వచ్చారు. ఈ సమయంలోనే తన సహా నటుడు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి "రాజావిన్ పర్వయిలే" చిత్రంలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం కావడం విశేషం.

1995లో విడుదలైన ‘ఆసాయ్’ చిత్రంతో తొలి సక్సెస్‌ని అందుకున్నారు అజిత్. అప్పటి నుంచి అజిత్ వెనక్కి తిరిగి చేసుకోలేదు.కాదల్ కొట్టై (ప్రేమ లేఖ), కాదల్ వారువాల,కాదల్ మన్నన్ వంటి రొమాంటిక్ చిత్రాలతో లేడి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ తర్వాత వచ్చిన వాలి చిత్రంతో కెరీర్ లోనే తొలిసారిగా హైయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్నారు. ఈ చిత్రంలో నటనకు గానూ అజిత్ పలు అవార్డులు అందుకున్నారు. 1999లో వాలితో కలిపి అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి.

 రొమాంటిక్ , ఫ్యామిలీ చిత్రాలకే పరిమితమైన అజిత్ 2000 నుండి ప్రయోగాలకు ప్రాధాన్యత నిచ్చారు. ఆలా వచ్చినవే ప్రియురాలు పిలిచింది, సిటిజన్, దీనా, విలన్ వంటి చిత్రాలు అజిత్ లోని ఉత్తమ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఈ చిత్రాలతో తమిళనాడు నాట  మాస్ ఆడియన్స్  ఫ్యాన్ బేస్ ను అయన సొంతం చేసుకున్నారు. అందరి హీరోల్లా కాకుండా.. జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్.

2008లో వచ్చిన ‘బిల్లా’ , 2010లో వచ్చిన గ్యాంబ్లర్ వంటి చిత్రాలు అజిత్ కెరీర్ లోనే మరుపురాని చిత్రాలుగా నిలిచాయి.  ఆరంభం, వీరమ్, ఎన్నాయ్ అరిందాల్, వేదాళం , వివేగం ,విశ్వాసం, నెర్కొండ పార్వై, వలిమై,తునివు తదితర చిత్రాలతో తన కెరీర్ లోనే అతిపెద్ద హిట్లను సొంతం చేసుకున్నారు.

దాదాపు 62 చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్‌లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు.అజిత్‌ సినిమాల్లోనే కాకుండా బైక్‌, కార్‌ రేస్‌, ఫోటోగ్రఫీ, రైఫిల్‌ షూటింగ్‌ వంటి పోటీల్లో కూడా రాణిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. యాక్టింగ్‌తో పాటు రేసింగ్‌లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న ఆయన.. అందులోనూ తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో ఆయన ఒకరు.

అజిత్ కమర్షియల్ పెలైట్, ఫైటర్ పైలెట్ లైసెన్స్ లను సైతం కలిగి ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంతో ఇష్టం.తనే సొంతంగా మినియేచర్ ఏరోప్లేన్స్, డ్రోన్స్ తయారుచేస్తూ ఉంటారు.షూటింగుల వల్ల విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అజిత్‌ స్థానికంగా ఉన్న యూనివర్సిటీలకు వెళ్లి ఏరోస్పేస్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ తెలుసుకుంటూ ఉంటారు. చెన్నైలోనే  మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి ఏరో డ్రోన్స్ విభాగంలో సలహాదారుగా అజిత్ పనిచేస్తున్నారు.

అలాగే, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి అడ్వాన్స్డ్ డ్రోన్ "దక్ష"ను తయారు చేశారు. ఆ డ్రోన్‌కు 2019 లో భారత డ్రోన్‌ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీంతో అజిత్ ప్రతిభను గుర్తించిన తమిళనాడు సర్కార్..  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అందించే అబ్దుల్‌ కలాం అవార్డును అజిత్‌కు అందించింది. అజిత్ తయారు చేసిన ఈ డ్రోన్స్ గురించి తెలిసిన భారత రక్షణ శాఖ వెంటనే సరిహద్దుల్లో నిఘా కోసం.. దాదాపు 200 డ్రోన్ల తయారు చేయమంటూ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు 170 కోట్ల రూపాయలు.

అజిత్ పారిశ్రామికవేత్తగా మారి ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. వీనస్ మోటార్ సైకిల్స్ టూర్స్, ఏకే మోటో రైడ్స్ పేరుతో కంపెనీలను నిర్వహిస్తున్నాడు. తన సోదరులైన అనూప్ , అనిల్ కుమార్ ల కంపెనీల్లో సైతం పెట్టుబడులు పెట్టారు.

అజిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే 2000వ సంవత్సరంలో ఆయన ప్రముఖ నటి షాలినిని పెళ్ళి చేసుకున్నారు.వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. అజిత్ బహుభాషాకోవిదుడు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు.

అజిత్ హీరోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. ఆపదల్లో ఉన్నవారికి లేదనుకుండా సహాయం చేస్తాడు. ఎందరో నిరుపేదలకు ఎడ్యుకేషన్ , వైద్య సేవల కోసం సహాయం చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోని ఆయన అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

                             --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com