సంగీత సామ్రాజ్యాధినేత

- May 05, 2024 , by Maagulf
సంగీత సామ్రాజ్యాధినేత

జ్యూస్ షాప్ లోని టేప్ రికార్డర్ లో పాటలు వింటూ అతడు జీవితాన్ని మొదలు పెట్టాడు... పాటలే తన జీవన గమనంగా మార్చుకొని సంగీత   సామ్రాజ్యానికి రారాజు అయ్యాడు. మారుతున్న సంగీత ప్రపంచంతో పాటు పరిగెడుతూ... ప్రతి అవకాశాన్ని అందుకున్నాడు. ఈనాడు భారత దేశం గర్వించదగ్గ ఎందరో గొప్ప గాయకులను పరిచయం చేసింది కూడా ఆయనే. ఆయన మరెవరో కాదు టీ-సిరీస్ (T-Series) అధినేత గుల్షన్ కుమార్. నేడు గుల్షన్ కుమార్ పుట్టినరోజు.

గుల్షన్ కుమార్ పూర్తి పేరు గుల్షన్ కుమార్ దువా. గుల్షన్ కుమార్ 1951, మే 5వ తేదీన న్యూ ఢిల్లీలో స్థిరపడిన పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. గుల్షన్ కుటుంబానికి  దరియాగంజ్ లో జ్యూస్ షాప్ ఉండేది. చిన్న తనంలోనే సినిమాల మీద ఆసక్తి పెరగడంతో ప్రతి రోజూ సినిమాలు చూస్తూనే గడిపేవాడు. పాటలు అంటే ఎంతో అభిమానం.

తండ్రి ఒత్తిడి మేరకు డిగ్రీ పూర్తి చేసిన గుల్షన్ , 1979లోనే సౌత్ ఢిల్లీలో ఒక చిన్న షాపు అద్దెకు తీసుకోని పంజాబీ,హిందీ, మార్వాలి భాషల్లో వెలువడిన భజన పాటలు, హిందీ సినిమా పాటల క్యాసెట్లు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో , పాత హిందీ పాటలను కొత్త గాయకులతో పాడించి క్యాసెట్ల రూపంలో తీసుకొచ్చి మార్కెట్ లో సక్సెస్ అయ్యారు గుల్షన్. ప్రముఖ గాయకులు కుమార్ సానూ, అనురాధ పౌడ్వాల్ , అల్కా యాగ్నిక్ , వందనా వాజపేయ్, సోనూ నిగమ్, కవితా పౌడ్వాల్ లను పరిచయం చేసింది గుల్షన్ కుమారే. వీళ్ళందరూ ఆయన్ని తమ గాడ్ ఫాదర్ గా చెబుతారు.

క్యాసెట్ల పరిశ్రమను అధ్యయనం చేసేందుకు జపాన్ , సౌత్ కొరియా దేశాలకు వెళ్లి అక్కడ సంగీత పరిశ్రమలో వచ్చిన మార్పులను పరిశీలించాడు. ఆ తర్వాత వెంటనే నోయిడాలో "సూపర్ కేసెట్స్ ఇండస్ట్రీస్"(T-Series) అనే మాగ్నెటిక్ టేప్ మరియు ఆడియో క్యాసెట్ల తయారీ ఫ్యాక్టరీని స్థాపించాడు. వ్యాపారం విస్తరించడం మొదలుపెట్టాక గుల్షన్ తన నివాసాన్ని ఢిల్లీ నుంచి ముంబై కు మార్చాడు.

భక్తి గీతాలు, రీమిక్స్ క్యాసెట్ల వ్యాపారంలో భారీగా లాభాలు గడించాక గుల్షన్ బాలీవుడ్ అడుపెట్టాడు. మొదట్లో సినిమా మ్యూజికల్ రైట్స్ కొంటూ బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. మ్యూజికల్ రైట్స్ తర్వాత తానే స్వయంగా నిర్మాతగా మారి ఆషికి సినిమా తీసాడు. మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో మరిన్ని బాలీవుడ్ చిత్రాలను గుల్షన్ నిర్మించాడు.

గుల్షన్ ఆడియో క్యాసెట్లు , సినిమా నిర్మాణం తర్వాత పలు వ్యాపారాల్లోకి ప్రవేశించాడు. నోయిడాలోని తన క్యాసెట్ ఇండస్ట్రీతో పాటుగా   టేప్ రికార్డర్స్ , టీవీలు, వాషింగ్ మిషన్లు, వీసీడీలను తయారు చేసి రిటైల్ అవుట్ లెట్స్ కు అమ్మేవాడు. తన సోదరుడి పేరు మీద గోపాల్ సోప్ అండ్ డిటెర్జెంట్స్ సంస్థను స్థాపించి సబ్బులు వ్యాపారం, రజిని ఇండస్ట్రీస్ కింద అగరొత్తులు తయారు చేసి అమ్మాడు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ , మినిరల్ వాటర్ వ్యాపారాలను గుల్షన్ నిర్వహించాడు. ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం 1997 నాటికి గుల్షన్ ఆస్తుల విలువ రూ. 2000 కోట్లు, కంపెనీల టర్నోవర్ రూ. 400 కోట్లు .

గుల్షన్ కుమార్ కు తోలి నుండి భక్తి ప్రపత్తులు ఎక్కువ. ఉత్తర భారత దేశంలో ఎన్నో దేవాలయాలను తన సొంత నిధులతో నిర్మించడం జరిగింది. అంతే కాకుండా చార్ ధామ్ యాత్రలకు వెళ్ళే భక్తులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా లంగర్ల నిర్మాణం కోసం నిధులు సమకూర్చాడు. అలాగే నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాడు.

ముంబై, పశ్చిమ అంధేరి ప్రాంతంలోని జీత్ నగర్ జీతేశ్వర్ మహదేవ్ మందిరం బయట 12 ఆగస్టు 1997న గుల్షన్ ను కాల్చి చంపారు దుండగులు. అలా జీవనగీతమై సాగిన గుల్షన్ ప్రయాణం బాలీవుడ్ విషాద గీతంలా ముగిసింది. ఆయన స్థాపించిన టీ-సిరీస్ సంస్థ ఉన్నంత వరకు పాటల రూపంలో అందరికి గుర్తొస్తూనే ఉంటాడు.  

                                                 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com