విశ్వకవి రవీంద్రుడు

- May 07, 2024 , by Maagulf
విశ్వకవి రవీంద్రుడు

‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు ఎక్కడ జ్ఞానం విరాజిల్లుతుందో అక్కడ దేశాన్ని నిలుపు..’ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘గీతాంజలి’లోని వాక్యాలివి. కవిత్వమనే ఎల్లలు లేని హృదయ భాషతో ఒక దార్శనికుడిలా నిలబడ్డారు. విశ్వమానవ వాదాన్ని ఖండాంతర వ్యాప్తి చేసిన కవితత్వ పితామహుడు గురుదేవ్ ఠాగూర్. నేడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి.

రవీంద్రుడు 1861, మే7వ తేదీన ఒకప్పటి వంగదేశం(వంగదేశం, బీహార్, జార్ఖండ్, మరియు ఒరిస్సాలతో కూడిన ప్రాంతం) రాజధాని కలకత్తాలోనే అత్యంత సంపన్న కుటుంబమైన ఠాగూర్ కుటుంబంలో జన్మించారు. 8 సంవత్సరాల వయస్సులో, రవీంద్రనాథ్ తన మొదటి కవితను రాశారు. 16 సంవత్సరాల వయసులో అతని తొలి కవితా సంకలనం ప్రచురితమయ్యింది. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళశాస్త్రంపై గురుదేవులకు ఉన్న ఆసక్తి ఆయన కవితలలో ప్రతిబింబిస్తుంది.

రవీంద్రుడు సంగీతవేత్త, అంతకుమించి గొప్ప మానవతావాది. కాబట్టే ఆయన కవిత్వ ప్రాసంగికత నేటికి సజీవంగా విరాజిల్లుతోంది. ప్రేమభావాన్ని, మార్మికతను నింపుకున్న రవీంద్రుడి కవిత్వం చాలామంది భారతీయ కవులను ప్రభావితం చేసింది. ఠాగూర్ రచనలు బెంగాలీ సాహిత్యానికి కొత్త శిఖరాలను అందించాయి. వాటిలో గీతాంజలి(1910), మానసి (1890), సోనార్ తారి (1894), గితిమాలయ (1914), రాజా (1910), పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి. తన కవితా రచన 'గీతాంజలి'కి సాహిత్యంలో నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.

జాతీయ స్వాతంత్య్రోద్యంలో పాల్గొన్న రవీంద్రుడు బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా అత‌డికి బ్రిటీష్ అధికారులు ఇచ్చిన 'నైట్‌హుడ్' బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న ర‌వీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భ‌క్తి గీతాల‌ను పాడేవారు. త‌న పాటల ద్వారా ప్రజల్లో చైత‌న్యాన్ని త‌ట్టిలేపేవారు.

భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతాన్ని అందించిన ఠాగూర్.. బంగ్లాదేశ్‌కి కూడా ‘అమర్ సోనా బంగ్లా’ జాతీయ గీతాన్ని రచించారు. రవీంద్రుడు వ్రాసిన "జనగణమణ" ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి "జనగణమన" దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించారు.

రవీంద్రుడు గొప్ప విద్యావేత్త. బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకుని స్నానం చేయడం, ప్రార్థన చేయడం, నియమిత వేళలో నిద్ర పోవడం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవడం, పరిశుభ్రత, సత్యాన్నే పలకడం, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లో కళా భవన్ ను ఆయన స్థాపించారు. ఇక్కడ విద్యార్థులు విభిన్న కళలను నేర్చుకునే వారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, రచయితగా, నాటక రచయితగా, సంగీతకారుడిగా, తత్వవేత్తగా, చిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎనలేని సేవలు చేశారు. మాతృభూమి, మానవసంబంధాల పట్ల అచంచలమైన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రుడు అనారోగ్యంతో 1941 ఆగస్టు 7న మరణించారు.
 
  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com