మనసున్న గుండె నిపుణుడు

- May 08, 2024 , by Maagulf
మనసున్న గుండె నిపుణుడు

ఆయన గుడిలో దేవుడు కాదు ... నిరుపేదల గుండె గుడిలో వైద్యుడు. అందుకే వాళ్ల ప్రాణాలని తన గుండెలో పెట్టి చూసుకుంటాడు. రోగుల గుండె చప్పుళ్లని హృదయంతో విని.. సహృదయంతో వైద్యం చేస్తాడు. ఆయన మరెవరో కాదు నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత గుండెనిపుణుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ దేవి శెట్టి.

డాక్టర్ దేవి శెట్టి అలియాస్ దేవి ప్రసాద్ శెట్టి 1953, మే 8వ తేదీన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కిన్నిగోలి గ్రామంలో జన్మించారు. శెట్టి  పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి గుండె మార్పిడి చేసిన దక్షిణాఫ్రికా సర్జన్ డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ గురించి విన్న తరువాత ఆయనలాగే గుండె శస్త్ర చికిత్స నిపుణుడిగా కావాలని నిర్ణయించుకున్నారు.

శెట్టి మంగళూరులోని ప్రముఖ కస్తూర్బా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. గుండె శస్త్ర చికిత్సలో ప్రావీణ్యత సాధించేందుకు లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో చేరి ఎఫ్.ఆర్.సీ.ఎస్ పూర్తిచేశారు. చదువు పూర్తిచేసిన తర్వాత కొంత కాలం లండన్ లోని గైస్ హాస్పిటల్ లో ప్రఖ్యాత వైద్యుడు అలన్ ఏట్స్ వద్ద పనిచేస్తూ ఎన్నో మెళుకువలు నేర్చుకున్నారు. అతికొద్ది కాలంలోనే లండన్ లోనే ప్రముఖ గుండె వైద్యుడిగా శెట్టి పేరుతెచ్చుకున్నరు.

లండన్ లో పనిచేస్తున్న సమయంలోనే పారిశ్రామికవేత్తలైన బిర్లా కుటుంబంతో శెట్టికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. బిర్లా పరివారం మొత్తానికి ఫ్యామిలీ వైద్యుడిగా డాక్టర్ శెట్టి మారిపోయారు. బిర్లా కుటుంబం అభ్యర్థన మేరకు 1989 లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన కోల్‌కాతాలోని బిఎం బిర్లా ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించారు. 1992లో దేశంలో మొట్టమొదటి నియోనాటల్ హార్ట్ సర్జరీని 21 రోజుల చిన్నారి రోనీకి విజయవంతంగా నిర్వహించారు. కోల్‌కాతాలో మదర్ థెరిస్సాకు గుండెపోటు రావడంతో ఆమెకు శస్త్రచికిత్స చేసి, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వైద్యుడిగా 1997లో ఆమె చనిపోయే వరకు సేవలందించారు.

1997లో మణిపాల్ విద్యాసంస్థల అధినేత రాందాస్ పాయ్ అభ్యర్థన మేరకు మణిపాల్ హార్ట్ హాస్పిట్స్ వ్యవస్థాపక నిర్వాహకుడిగా శెట్టి  బాధ్యతలు చేపట్టి 2001వరకు కొనసాగారు. పేదలకు తక్కువ ఖర్చుతోనే గుండె శస్త్ర చికిత్సను అందించాలనే ఉద్దేశంతో  2001లో బెంగళూరు శివార్లలోని బొమ్మసంద్రలో నారాయణ హృదయాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు.

ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా పలు నగరాల్లో నారాయణ హెల్త్ కింద 25 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎనిమిది హార్ట్ సెంటర్స్, పాతిక  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శెట్టి నడుపుతున్నారు. కోల్‌కాతాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (RTIICS) ను స్థాపించిన శెట్టి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 5,000 పడకల స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.అలాగే, అహ్మదాబాద్ లో 5,000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో ఆయన సంస్థ నారాయణ హెల్త్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

రెండు దశాబ్దాల కిందట భారత దేశంలో గుండె శస్త్ర చికిత్స ఖర్చు చాలా ఎక్కువ ఉండటంతో, ఆ ఖర్చును భరించలేక మధ్యతరగతి ప్రజలు, నిరుపేదలు వెనుకాడేవారు. నేడు ఆ వ్యయాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చి.. మిగిలిన ఆసుపత్రులకు మార్గదర్శిగా నిలిచారు దేవీప్రసాద్. ఆస్పత్రులు ఎకానమీ అనే ఆలోచనను అవలంబిస్తే వచ్చే 5-10 ఏళ్లలో ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని 50 శాతం తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

పేద రైతుల కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయించి, నెలకు రూ. 18వేలు చెల్లింపుపై అన్ని రకాల వైద్య సేవలను అందించే "యశస్విని" అనే ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద కర్ణాటక వ్యాప్తంగా 40 లక్షల మంది లబ్దిపొందుతున్నారు.

నాణ్యతతో కూడిన చౌకైన ప్రజా ఆరోగ్య సంరక్షణ రంగానికి డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను 2004 లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇవే కాకుండా ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు, కర్ణాటక రత్న అవార్డులు వంటివి ఎన్నో అందుకున్నారు.
 
 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com