ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

- May 08, 2024 , by Maagulf
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వివిధ సమస్యల నుంచి ప్రజలను రక్షిస్తూ..  వారిని శాంతియుతంగా ఉంచేందుకు మరియు ఐక్యతను చాటుకోవడమే లక్ష్యంగా ప్రపంచ రెడ్ క్రాస్ డేని జరుపుకుంటారు.  ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్నే రెడ్ క్రెసెంట్ డే అని కూడా అంటారు. నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం.

19 వ శతాబ్దపు మొదటి 70 సంవత్సరాలు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాలకు సాక్షీభూతంగా నిలిచాయి. 1861 లో అమెరికన్ సివిల్ వార్ ప్రారంభమైంది. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. అంతకు ముందు వాటర్‌లూ, క్రిమియా, ఐరోపాలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరిగాయి. వీటిలోనూ లక్షలాది మంది చనిపోయారు.

యుద్ధ సమయంలో, తర్వాత కూడా శత్రు దేశాలు ఒకరినొకరు అమానవీయంగా చూసుకున్నాయి. ఈ ప్రవర్తనలను ఆపేందుకు దేశాల మధ్య ఎటువంటి చట్టంగానీ, ఒప్పందంగానీ లేదు. ఈ అమానవీయ దురాగతాలకు సాక్షుల్లో ఒకరు స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే కార్యకర్త. 1859 లో ఇటలీలోని సోల్ఫిరెనో యుద్ధంలో హెన్రీ ఈ భయంకర నిజాలను చూశాడు. ఈ యుద్ధంలో 40 వేల మంది సైనికులు మరణించగా.. వారిలో చాలామంది వేదనతో చనిపోయారు. వారికి ఎటువంటి వైద్య సహాయం అందలేదు.

యుద్ధ సమయాల్లో గాయపడిన వారికి సహాయం చేయడానికి, అమానవీయ దురాగతాలను నిరోధించడానికి దేశాల మధ్య ఒప్పందం అవసరమని హెన్రీ నొక్కిచెప్పారు. అనంతరం జెనీవాలో 12 దేశాల ప్రతినిధులు సమావేశమై రెడ్‌ క్రాస్‌ సంస్థ స్థాపనకు పూనుకున్నాయి. సంస్థ ప్రారంభం నుంచి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధంలో గాయపడిన సైనికులు, పౌరులు, యుద్ధ ఖైదీల హక్కులను కాపాడటానికి రెడ్‌ క్రాస్‌ ప్రయత్నిస్తున్నది. 1901 లో హెన్రీ డునాంట్, ఫ్రెడరిక్ పాస్సీతో కలిసి శాంతి ప్రయత్నాల కోసం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మానవతావాద కృషికి రెడ్ క్రాస్ 1917, 1944 లలో నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది.

 ఈ రెడ్ క్రాస్ డే రోజు.. విపత్తులతో బాధపడుతున్న పేద ప్రజలకు సహాయం చేయడానికి అనేక ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి.. వారికి అవసరమైన సేవలు అందిస్తాయి. ప్రాథమిక అవసరాలకు దూరంగా ఉన్నవారికి సౌకర్యాలు కూడా అందిస్తారు. ఆహార కొరత, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల్లో, యుద్ధాలలో చిక్కుపోయినవారికి ఈ రోజును అంకితం చేశారు.

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తు కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ రోజును నిర్వహిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ దినోత్సవాల్లో పాల్గొంటాయి. సమస్యను మెరుగైన రీతిలో జరిపించేందుకు కొందరు వాలంటీర్లు స్వచ్ఛందంగా వస్తారు. ఈ డే ద్వారా రెడ్ క్రాస్ సోసైటీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రచార, సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేస్తోంది. శాంతియుత వాతావరణం, ప్రజలు ఇబ్బంది పడని నేపథ్యం సృష్టించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుంది.

ప్రతి సంవత్సరం ఈ రెడ్ క్రాస్ డేని ఓ కొత్త థీమ్తో సెలబ్రేట్ చేస్తారు. ఈ 2024  సంవత్సరంలో.. నేను ఏ సేవ చేసిన దానిని ఆనందంతో చేస్తాను.. నేను ఆనందంగా సేవ చేయడమే నేను ఇచ్చే బహుమతి.. అనే థీమ్తో ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. అంటే మనం చేసే ప్రతి పని హృదయం నుంచే వస్తుంది అనే థీమ్పై ఈ రెడ్ క్రెసెంట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ థీమ్స్తో ప్రజలకు సేవ చేస్తూ రెడ్ క్రాస్ డే ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అలాగే ప్రజల్లో రెడ్ క్రెసెంట్ ఉద్యమంపై అవగాహన పెంచింది.  
 

      --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com