జాతీయ సాంకేతిక దినోత్సవం

- May 11, 2024 , by Maagulf
జాతీయ సాంకేతిక దినోత్సవం

నానాటికీ అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది.మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరజ్ఞానం కూడా పెరిగిపోతుంది. ప్రజల దైనందిన జీవితంలో వస్తున్న మార్పులకు కారణం సాంకేతికతే. ప్రస్తుతం ప్రజల నిత్యజీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారిపోయింది.ఈ సాంకేతిక విప్లవంలో భారతదేశం సైతం ముఖ్యభూమిక పోషిస్తుంది. భార‌త‌దేశ సాంకేతిక పురోగ‌తికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించబడుతుంది.

సుమారు 26 సంవత్సరాల క్రితం 1998వ సంవత్సరం మే 11 న భారతదేశం రెండో అణ్వస్త్ర పరీక్షలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-2 లేదా ఆపరేషన్ శక్తి అంటారు. ఈ పరీక్షలకు దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ ఏరోస్పేస్ సైంటిస్ట్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ నేతృత్వం వహించారు. అంతే కాదు సరిగ్గా అదే రోజున మన శాస్త్రవేత్తలు రూపొందించిన న్యూక్లియర్ క్షిపణులు విజయవంతంగా పరీక్షించబడ్డాయి.

ఈ పోఖ్రాన్-2 విజయాన్ని పురస్కరించుకొని నాటి ప్రధాని వాజ్‌పేయి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా ప్రకటించడమే కాకుండా భారతదేశ శాస్త్రవేత్తలు సాధించిన విజయాలకు గుర్తుగా మే 11ను జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. 1999 నుండి జాతీయ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడుతుంది.
 
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com