రాజకీయ ద్రోణుడు..!
- May 19, 2024
మానవులు పుడతారు...చనిపోతారు. అందులో కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు. ఈ కోవలోకే వస్తారు రాజకీయ బీష్ముడు నీలం సంజీవ రెడ్డి. నేడు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జయంతి.
నీలం సంజీవరెడ్డి 1913 మే 19వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా శింగనమల తాలూకా ఇల్లూరు గ్రామంలోని సంపన్న రైతు కుటుంబమైన నీలం చిన్నప రెడ్డి,సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు నీలం రాజశేఖర్ రెడ్డి వీరి సోదరుడు కాగా, వామపక్ష రాజకీయ దిగ్గజం తరిమెల నాగిరెడ్డి వీరి మేనబావ. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నారు
నీలం కుటుంబం తోలి నుండి రాజకీయ కుటుంబమే. తండ్రి చిన్నపరెడ్డి, మేనమామ తరిమెల సుబ్బారెడ్డిలు నాటి అనంతపురం జిల్లాలో ముఖ్యులు. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో ప్రవేశించిన నీలం తన కుటుంబ రాజకీయ ప్రాబల్యంతో పాటుగా ఆనాటి కాంగ్రెస్ నేతలకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న యువనేత కావడంతో, ఆయన రాజకీయ ఎదుగుదల వేగంగా జరిగింది. నాటి కాంగ్రెస్ పెద్దలైన పట్టాభి సీతారామయ్య, ప్రకాశం పంతులు, కళా వెంకట్రావుల శిష్యరికంలో రాజకీయాల్లో రాటుదేలారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
గాంధీజీకి ముఖ్య అనుచరుడైన పట్టాభి సీతారామయ్య ప్రోద్బలంతో నీలం 1936లో రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కొన్ని సంవత్సరాల ముందు ఆంధ్ర ప్రొవెన్షియల్ కమిటీకి సెక్రటరీగా ఎన్నికై 1946 వరకు కొనసాగారు.1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949 నుండి 1951 వరకు పూసపాటి కుమారస్వామి రాజా మంత్రివర్గంలో ప్రొహిబిషన్, గృహ నిర్మాణం& అటవీ శాఖల మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పెద్దలైన పట్టాభి, కళా వెంకట్రావు అనుచరుడిగా 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నీలం ఎన్నికయ్యారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన బావ, విప్లవ యోధుడు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తరిమెల జైలు నుంచే పోటీ చేసి గెలవడం నాటి రాజకీయాల్లో ఒక సంచలనం.1952లో శ్రీకాళహస్తి ఎమ్యెల్యే బలరామిరెడ్డి రాజీనామాతో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు.1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెసు శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
1954 మధ్యలో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో ఆంధ్ర రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రాజీనామా కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. అయితే ప్రధాని నెహ్రూ పూనుకొని 1955లో ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ కు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో, కాంగ్రెస్ తరుపున బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
1956 ఫిబ్రవరి 20 న జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుకు నిర్ణయించి ఇరు ప్రాంతాల ముఖ్య నాయకులు సంతకాలు చేశారు. ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి సంతకాలు చేశారు. 1956,నవంబర్ 1 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, నీలం ముఖ్యమంత్రి అయ్యారు.
1956-60,1962-64ల మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. విజయవాడ కృష్ణానదిపైన, నిర్మించిన రోడ్డూ, రైలు వంతెనలు సంజీవరెడ్డి చొరవ వలననే సాధ్యపడ్డాయి. ప్రతిష్టాత్మక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మొదలైంది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగంగా ముందుకు సాగి 1967లో పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపేందుకు నీలం ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిన్న, మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలయ్యాయి,కానీ ఆయన తర్వాత వచ్చిన వారు వాటిపై ఆసక్తి చూపకపోవడంతో నత్తనడకన సాగాయి. అందుకు ముఖ్య ఉదాహరణే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ వాసుల గొంతులు తడిపి వారికి దైవంగా మారారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రహదారులు నిర్మించారు.
సంజీవ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణం గావించారు. ముఖ్యంగా భద్రాచలం ఆలయ పునర్నిర్మాణానికి కమిటీని ఏర్పాటు చేసి నిస్వార్థ రాజకీయ నాయకుడైన, మాజీ మంత్రి కల్లూరి చంద్రమౌళి గారిని అధ్యక్షుడిగా నియమించారు. నీలం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో శరవేగంగా ఆలయ జీర్ణోద్ధరణ పనులు మొదలు అయ్యాయి. రాజకీయ అపవాదులను, కష్ట నష్టాలను చంద్రమౌళి గారు అపార భక్తితో భరించి భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించి లక్షలాది భక్తులకు భద్రాద్రి రాముని దర్శన భాగ్యాన్ని కల్పించారు.
1960లో కామరాజ్ ప్రణాళికలో భాగంగా నాటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 1962వరకు కొనసాగారు. 1964 -1967 మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో ఉక్కు, గనులు,రవాణా& వాయు శాఖల మంత్రిగా నీలం పనిచేశారు. 1967-1969 వరకు 4వ లోక్‌సభ స్పీకర్ గా పనిచేశారు.
1969లో కాంగ్రెసు పార్టీ ఆధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవ రెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ ఇందిరా కాంగ్రెస్, పాత కాంగ్రెస్ పార్టీలుగా చీలిపోయాయి. సంజీవరెడ్డి పాత కాంగ్రెస్ లోనే కొనసాగారు.
1971 లోక్ సభ ఎన్నికల్లో సంజీవ రెడ్డి అనంతపురం లోక్ సభ నుండి పాత కాంగ్రెస్ తరుపున పోటీ చేసి తన శిస్యుడైన అంథోని రెడ్డి చేతిలో ఓటమి చెంది రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నాయకుడు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారి పిలుపు మేరకు నీలం రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు.
1977 లోక్ సభ ఎన్నికల్లో నంద్యాల నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నీలం విజయం సాధించారు. తన మిత్రుడైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో చేరకుండా మళ్ళీ 6వ లోక్‌సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కొద్దీ మాసాలకే వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి పోటీ లేకుండానే రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు.
నీలం సంజీవ రెడ్డి ఎందరినో రాజకీయాల్లో ప్రోత్సహించి నాయకులుగా తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి,కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి తదితర నేతలు ఉన్నారు.
నీలం సంజీవ రెడ్డి వ్యక్తిగత జీవితానికి వస్తే 1935,జూన్ 8న తరిమెల నాగిరెడ్డి సోదరి నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నీలంని అయన సోదరుడు నీలం రాజశేఖర్ రెడ్డి, మేనబావ తరిమెల నాగిరెడ్డిలు మొదటి నుంచి రాజకీయంగా వ్యతిరేకించేవారు.
అనంతపురం జిల్లా రాజకీయాల్లో వామపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువులైన వీరిద్దరిని చూస్తే సంజీవ రెడ్డి తడబడే వారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఎలా ఉన్న వ్యక్తిగతంగా మాత్రం తన బావ నాగిరెడ్డి అంటే సంజీవరెడ్డికి ఎంతో గౌరవం ఉండేది. తన చెల్లెలు లక్ష్మీ కాంతమ్మ - నాగిరెడ్డిల వివాహానికి పెద్దల్ని ఒప్పించి జరిపించడంలో సోదరుడు నీలం రాజశేఖర్ రెడ్డితో పాటు తనవంతు కృషి చేశారు.
రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత అనంతపురంలో ఉన్న సమయంలో, వీరి సలహాల కోసం, ఆశీస్సుల కోసం నాయకులందరూ తరలి వచ్చేవారు. మారిన రాజకీయ పరిస్థితులను తలుచుకొని తన వద్దకు వచ్చిన వారి దగ్గర తన ఆవేదన పంచుకునేవారు.“మితిమీరిన స్వార్థంతో అధికారం కోసం అడ్డదారుల్లో పోరాటాలు చేస్తున్నారు" ఇది చాలా అనాగరికం. ముఠా కక్షలు, హత్యా రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు ఎక్కువైపోతున్నాయి. నా దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులందరితోనూ నిక్కచ్చిగా చెప్తున్నాను పదవులకోసం ఇంతగా దిగజారిపోవాలా? ప్రజలను తక్కువ అంచనాలు వేయకండి. ఎప్పుడో ఒకసారి తీవ్రంగా ఎదురు తిరిగి బుద్ది చెప్తారు, “ రాజకీయాల్లో ఏమిటీ కోట్ల సంపాదన?బ్రతకడానికి ఇంత అవసరమా?” అని చివరి రోజుల్లో తీవ్రంగా మదనపడేవారు.
భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త సంజీవ రెడ్డి 1996, జూన్ 1న 83 ఏళ్ళ వయస్సులో మరణించారు.నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సమున్నత విలువలకు పట్టం కట్టడంతో పాటు, పదవులకు వన్నె తెచ్చిన విలక్షణ వ్యక్తిత్వం కల నేతగా గుర్తింపు పొందారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!