పాటల పూదోట విహారి...వేటూరి

- May 22, 2024 , by Maagulf
పాటల పూదోట విహారి...వేటూరి

తెలుగు పాటకు మరో పేరు వేటూరి సుందరరామమూర్తి. వేణువై వచ్చాను భువనానికీ అంటూ ఎన్నో పాటలను ఇచ్చి వెళ్లారు. 70వ దశకం నుంచి సినిమా పాటను పలురకాలుగా పరవళ్ళు తొక్కించిన ఘనత వేటూరిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు.. ఒకవైపు సాహిత్య విలువలున్న సంప్రదాయమైన పాటలు అందిస్తూనే మరో వైపు మసాలాలు దట్టించిన మాస్‌ పాటలతో విజిల్స్‌, స్టెప్పులు వేయించారు..రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే అంటూ ఆయన ప్రేక్షకులనందరినీ కన్నీటి పర్యంతం చేశారు. నేడు పాటల రచయిత వేటూరి వర్థంతి.

వేటూరి సుందరరామమూర్తి 29 జనవరి 1936 న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలోని చల్లపల్లికి సమీపంలో ఉన్న పెదకల్లేపల్లిలో జన్మించారు.తెలుగు పరిశోధనా పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి కి సుందర రామ మూర్తి గారు సమీప బంధువు.తాత వేటూరి సుందర శాస్త్రి గారు కూడా ఒక కవి.విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేశారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. 1952 లో ఆంధ్రప్రభలో సబ్-ఎడిటర్ గా ఉద్యోగంలో చేరారు.

పత్రికా రంగంలో తనకు  మొదటి గురువు శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారే అని చెప్పుకొనే వారు. ఆయన నుంచి వార్త ఎలా రాయాలో నేర్చుకున్నారట.  తరువాత 1959 లో ఆంధ్రపత్రికలో చేరారు, అక్కడ ఆయనకు బాపు, ముళ్ళపూడి వెంకట రమణ గారితో పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పింది అనేవారు. ఆంధ్రపత్రికలో సినిమా విభాగానికి ఇన్‌ఛార్జిగా కూడా వేటూరి  పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక దినపత్రిక ఆంధ్రజనతకు ఆయన సంపాదకుడిగా కూడా వ్యవహరించారు.

1962లో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన ఏకైక తెలుగు పాత్రికేయుడు వేటూరి. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి జాతీయ నాయకుల ప్రసంగాలను ఆయన తర్జుమా చేశారు. 1964 లో అసెంబ్లీ రిపోర్టర్‌గా పనిచేశారు. వేటూరి వ్యాసాలు చాలా ఆకర్షణీయంగా, చమత్కారంగా ఉండేవి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సమీపంలో ఉన్న హోటల్ ద్వారకాలో ఎమ్మెల్యేల సమావేశాన్ని “అదిగో ద్వారకా- ఇవిగో అలమందలు” (“ఇది ద్వారకా, ఇక్కడ పశువులు”) అని ప్రస్తావించారు.

వేటూరి కంటే ముందు ఉన్న గేయ రచయిత ఆత్రేయ గొప్ప సినీ కవి అయితే ఆయన నిర్మాతలకు పాటలు రాయకుండా ఏడ్పించే వారట. ఒకొక్క పాటకు రెండు నెలలు తీసుకోవడం తో అప్పటి నిర్మాతలు కొత్త గేయ రచయిత కోసం వెతుకుతుండగా వేటూరి సాహిత్యం వాళ్లకు నచ్చింది.కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు.  

1970 లో వేటూరి పాటలు ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించాయి. 1977 లో సీనియర్ ఎన్.టి.ఆర్ యొక్క “అడవి రాముడు” సినిమాలో స్ఫూర్తిదాయకమైన, శృంగారభరితమైన సాహిత్యాన్ని రాసిన వేటూరి ప్రతిభతో నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. 1978 లో కె. విశ్వనాథ్ గారు “సిరిసిరిమువ్వ” సినిమా కవిత్వంతో విభిన్న భావోద్వేగాలను పలికించడంలో తన పాటల విశ్వరూపాన్ని చూపించారు.

సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేద శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమైన అద్బుతమయిన పాటలు! ఆ రోజుల్లో ప్రముఖ గీత రచయితలు చేయలేని పనిని కొన్ని నిమిషాల్లో దర్శకుడి అభిరుచికి తగినట్టుగా పాట రాయగల సామర్థ్యం ఉన్నందున  వేటూరి దర్శకులకు, నిర్మాతలకు ప్రీతిపాత్రులు అయ్యారు.

1983 నాటికి తెలుగు యూత్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలోని ఎమోషన్స్‌కి తగినట్లుగా పాటలోని వరుసలు…వారి హృదయ వరుసలు ట్యూన్ అయ్యేలా రాసి గర్ల్‌ఫ్రెండ్ నచ్చిన తర్వాతి ఆనందాన్ని ఇంగ్లీష్‌ పదాలైన ఛాన్సు, రొమాన్సు, యురేకా వంటి ప్రయోగాలతో నభూతో నభవిష్యతి అన్న తరహాలో అందించాడు.ఆదికవి వాల్మీకి ‘శోకం నుంచే శ్లోకం పుడుతుంది అన్నాడు. అలాగే ఈ సినీకవి తను రాసిన పాటల్లో అద్భుతమైన సింబాలిజమ్‌ను అలాగే కవితాత్మను సైతం ప్రవేశపెట్టారు. సప్తపది సినిమాలోని గోవుళ్లు తెల్లన… అనే పాటలోని చరణంలో ఈ భావాన్ని అనన్య సామాన్యంగా వ్యక్తీకరించాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలనీ… అందులోంచి రసవంతమైన గేయాలు వస్తాయని భావగర్భితంగా చెప్పారు.

వేటూరి తన సినీ కెరీర్లో 5,000 పాటలకు పైగా రాశారు. ‘వేటగాడు”, “డ్రైవర్ రాముడు’ వంటి సినిమాలకు రాసిన మాస్ పాటల కు ఎంత ఆదరణ లభించిందో, ‘శంకరభరణం”, ‘సాగర సంగమం’ వంటి క్లాస్ సినిమాలకు రాసిన పాటలకు కూడా అంత కన్నా ఎక్కువ ఆదరణ లభించింది. ముఖ్యంగా, “శంకరభరణం’ సినిమాకు ఆయన రాసిన పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచాయి.

సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు.  

ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసి తన మాతృ భాషాభిమానాన్ని చాటుకున్నారు.

వేటూరి మంచి మాటకారి. తన సినీ, పాత్రికేయ అనుభవాలను గురించి ఒకానొక సందర్భంలో చెబుతూ “సినిమా వాళ్ళతో లౌక్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను.’ అలాగే “రాజకీయ నాయకుల పరిచయం వల్ల బ్రతుకుకు కావాల్సిన విజ్ఞానాన్ని నేర్చుకున్నాను,” అని అనేవారు. వేటూరి పాటలు ఎంత ఫేమస్సో ... అదే విధంగా ఆయన ఛలోక్తులు అంతే ఫేమస్.

సినీ తోటలోని పాటలు చెట్టుకు...కొమ్మకొమ్మకు సన్నాయిలు పూయించి....రాగాల పల్లకిలో ప్రేక్షకుల్ని ఊయలలూగించిన పాటల మాంత్రికుడు వేటూరి 2010, మే 22వ తేదీన 74 ఏళ్ల వయస్సులో మరణించారు. తెలుగు సినిమా పాట దశనూ దిశనూ మార్చిన సినీకవి వేటూరి సుందరరామ మూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆయన మధుర గీతాలు అభిరుచిగల శ్రోతలను అలరిస్తూనే వుంటాయి.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com