రివ్యూ: ఒక అమ్మాయి తప్ప!
- June 10, 2016
చిత్రం: ఒక్క అమ్మాయి తప్ప! నటీనటులు: సందీప్‌కిషన్.. నిత్యమేనన్.. రవికిషన్.. అలీ.. తాగుబోతు రమేష్.. సప్తగిరి తదితరులు ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాత: అంజిరెడ్డి, రచన-దర్శకత్వం: రాజసింహా విడుదల: 10-06-2016
నవతరం దర్శకుల ఆలోచనా ధోరణి మారింది.
రొటీన్ కథలు రాసుకోవడం లేదు. ఏదో ఓ కొత్తదనం చూపించాలనే ప్రయత్నిస్తున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఆలోచన బాగున్నా, దాన్ని తెరపై తీసుకొచ్చి ఓ కథగా చెప్పే విషయంలో కొంతమంది తడబడుతున్నారు. రచయితగా పేరు తెచ్చుకొన్న రాజసింహా... ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన కూడా ఫ్లైఓవర్‌పై బాంబు.. అనే కాన్సెప్ట్‌ని రాసుకొన్నారు. కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉంది. మరి దాన్ని ఎంత వరకూ తెరపై అర్థవంతంగా చూపించగలిగారు? ఈ రచయిత దర్శకుడిగా పాస్ అయ్యాడా, లేదా? తెలుసుకోవాలంటే 'ఒక్క అమ్మాయి తప్ప' కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటి? కృష్ణవచన్ (సందీప్ కిషన్) నేటితరం కుర్రాడు. చదువు పెద్దగా అబ్బలేదు. కానీ తన తెలివి తేటలపై అపారమైన నమ్మకం. దేశభక్తి కూడా ఎక్కువ. చిన్నప్పుడు స్కూల్లో మాంగో అనే అమ్మాయికి త్రివర్ణ పతాకం ఇచ్చి.. ఐ లవ్ యూ చెబుతాడు. చిన్నప్పటి ఆ అమ్మాయిని ఇరవై ఏళ్లయినా మర్చిపోలేడు. ఓసారి ఓ భయంకరమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొంటాడు. అక్కడ సత్య (నిత్యమేనన్) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ఆ సత్య.. తాను చిన్నప్పుడు ఇష్టపడిన మాంగో ఒక్కరే అని తెలుస్తుంది. ఆ విషయం సత్యకు చెప్పేలోగా.... కృష్ణకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే.. ఆ ఫ్లైఓవర్ పై మూడు టైం బాంబులు అమర్చారు. అవి కాసేపట్లో పేలబోతున్నాయి. అంతే కాదు... తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న సత్య కూడా ప్రమాదంలో ఉందన్న సంగతి అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చేయిస్తోంది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? లక్షల మంది ప్రాణాల్ని కృష్ణ కాపాడాడా, లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే... ఉగ్రవాదులు బాంబులు పెట్టడం, దాన్ని హీరో తొలగించి అమాయకుల్ని రక్షించడం అన్న కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. అయితే ఆ బాంబు బ్లాస్టుని ఓ ఫ్లైఓవర్కి మార్చి... కథంతా అక్కడే నడపాలనే ప్రయత్నం మాత్రం బాగుందనే చెప్పాలి. అంతేకాదు.. ఆ బాంబులు పేల్చడానికి ఉగ్రవాదులు ఎంచుకొన్న సాధనం కూడా హీరోనే కావడం కథలోని కొత్త పాయింట్. బహుశా అక్కడే సందీప్, నిత్యలు లాక్ అయిపోయి ఉంటారు. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ దగ్గర వచ్చే చిక్కేంటంటే.. అసలు పాయింట్ చిన్నదే ఉంటుంది. దానికి ముందూ వెనుక ఉన్న కథని తెలివిగా నడపాలి. అన్ని పాత్రలనూ ఫ్లైఓవర్కి లింకు చేసి, అక్కడ ఉగ్రవాదులతో డ్రామా నడిపించడానికి కొంత టైమ్ పడుతుంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు తన ప్రతిభాపాటవాల్ని చూపించాలి. అయితే అక్కడే రాజసింహా కాస్త తడబడ్డాడు. అసలు పాయింట్ మొదలుపెట్టక ముందు జరిగే తతంగం అంతా బోరింగ్‌గా సాగుతుంది.
ఫ్లై ఓవర్‌పై కమెడియన్ గ్యాంగ్‌ను దించి కాలక్షేపం చేద్దామనుకొన్నా.. ఆ సన్నివేశాలు పెద్దగా పేలలేదు. దాంతో దర్శకుడు టైం పాస్ చేసున్నాడనిపిస్తుంది. విశ్రాంతి దగ్గరే కథ ఓ లైన్లో పడుతుంది. ఆ తర్వాత కూడా హీరో, విలన్లు ఫోన్లో మాట్లాడుకోవడం.. కేవలం ఫోన్ సంభాషణల ఆధారంగా కథ నడవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఒకట్రెండు చోట్ల మాత్రం దర్శకుడు తన తెలివి తేటల్ని చూపించాడు. మిగిలిన సన్నివేశాలన్నీ.. సోసోగా నడిచిపోతాయి. సెకండాఫ్‌లో హీరోయిన్ని ఆటోకే పరిమితం చేశారు. హీరోయిజం చూపించే అవకాశం కూడా.. సందీప్‌కి అంతగా ఇవ్వలేదు. ఇంత ట్రాఫిక్ జామ్ అయినా.. పోలీసులేం చేయలేకపోయారా? 12 గంటల ట్రాఫిక్ జామ్ అయితే అదేం ఇష్యూ కాలేదా? అన్నది లాజిక్కు అందని విషయాలు.
ఎవరెలా చేశారంటే.. సందీప్‌కిషన్ తన ఎనర్జీ లెవల్స్ ఈ సినిమాలోనూ చూపించాడు. యాక్టింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? అయితే డైలాగులు పలికేటప్పుడు మరికాస్త నిదానం అవసరం. నిత్యమేనన్కి అంత స్కోప్ లేదు. సెకండాఫ్‌లో ఆమె పాత్రకు అసలు ప్రాధాన్యమే లేదు. బాగా బొద్దుగా కనిపించింది. రవికిషన్ ఫోన్లో అరవడానికే సరిపోయింది. కామెడీ గ్యాంగ్ ఏదో నవ్వించడానికి కాస్త ప్రయత్నించింది. మిగిలినవాళ్లవన్నీ చిన్న చిన్న పాత్రలే.
మిక్కీ పాటల్లో కొత్తగా వినిపించినవి లేవు. ఆర్.ఆర్ మాత్రం బాగానే సాగినట్టు అనిపించింది. చోటా ఈ సినిమాకి లైఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫ్లైఓవర్ ఎఫెక్ట్ వచ్చేలా సెట్లో సీన్లు తీసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. మాటలు అక్కడక్కడ ఓకే అనిపించినా, కొన్ని చోట్ల సందేశాలు వినిపించడం టూమచ్ అనిపిస్తుంది.
* కాన్సెప్ట్ * సందీప్ కిషన్
* లాజిక్‌లేని కథనం * ప్రథమార్ధం
చివరగా: పేలని బాంబు.. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
- విద్యుత్ ఛార్జీలు పెంచనున్నాం: సీఎం చంద్రబాబు
- ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…







