' రైట్ రైట్ ' మూవీ రివ్యూ

- June 10, 2016 , by Maagulf
' రైట్ రైట్ ' మూవీ రివ్యూ

సక్సెస్ ఫుల్ సినిమాల ప్రొడ్యూసర్ గా అగ్రనిర్మాతగా కొనసాగిన ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన సినిమా రైట్ రైట్. నాజర్, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. సుమంత్ అశ్విన్ మొదటినుంచీ విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం వరసగా లవర్, కొలంబస్ లాంటి యావరేజ్ సినిమాలతో లీన్ ప్యాచ్ లో ఉన్న ఈ కుర్రహీరో, మళయాళంలో హిట్టైన ఆర్డినరీ సినిమాను రీమేక్ గా తీసి హిట్టు కొట్టే ప్రయత్నం చేశాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా..? ఆడియన్స్ తో రైట్ రైట్ సినిమా అనిపించగలిగిందా..? చూద్దాం.
కథ
శృంగవరపు కోట నుంచి కవిటి వరకూ తిరిగే బస్సుకు కండక్టర్ సుమంత్ అశ్విన్, డ్రైవర్ గా ప్రభాకర్ పని చేస్తుంటారు.
ఊరి ప్రజలతో మంచి అనుబంధం, చీకూ చింతా లేని జాబ్స్ తో ఇద్దరి జీవితం చాలా హాయిగా సాగిపోతుంటుంది. ఆ బస్సులో రోజూ ప్రయాణించే పూజా ఝవేరికి అశ్విన్ కు మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇదిలా ఉంటే, ఆ ఊరి పెద్ద నాజర్ తను పెంచి పెద్ద చేసిన అమ్మాయిని, కోడలిగా చేసుకోవాలనుకుంటుంటాడు. ఆ అమ్మాయిని వేరే వ్యక్తి కూడా ప్రేమిస్తుంటాడు. ఇలా సమాంతరంగా జరుగుతున్న కథలు ఇంటర్వెల్ లో ట్విస్ట్ తో ఒకచోట కలుస్తాయి. హీరో బస్సు నడుపుతుండగా ఒక వ్యక్తి వచ్చి దాని కింద పడటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇన్నాళ్లూ సుఖంగా నడిచిన హీరో జీవితం కష్టాల్లో పడుతుంది. మరి ఈ కష్టాల్ని అతను ఎలా దాటగలిగాడు..? హీరోయిన్ ప్రేమను దక్కించుకోగలిగాడా..? బస్సు కింద పడిన వ్యక్తి ఎవరు..? ఇవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
పెర్ఫామెన్స్:
సుమంత్ అశ్విన్ పెర్ఫామెన్స్ లో సినిమా సినిమాకూ ఈజ్ పెరుగుతోంది. ఇక కాలకేయ ప్రభాకర్ ఫస్ట్ టైం పాజిటివ్ రోల్ లో నటించాడు. ఈ తరహా పాత్రలు తనకు కొత్తైనప్పటికీ, వీలైనంత మంచిగా కనిపించడానికి ట్రై చేశాడు. నాజర్ తనకు అలవాటైన రీతిలో సహజంగా నటించాడు. పూజా ఝవేరి నటన గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. మిగిలిన నటీనటుల్లో షకలక శంకర్ కొద్దిగా నవ్వించాడు. మిగిలిన వాళ్లందరూ పాత్రలకు తగ్గట్టు నటించారు.
టెక్నికల్ గా..:
హిట్ కోసం మళయాళ రీమేక్ ను ఎంచుకున్న దర్శకుడు మను, సినిమాను ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. సన్నివేశాలు సాగతీతగా ఉండటం ఆడియన్స్ సహనానికి పరీక్షే. ఎడిటర్ ఉద్ధవ్, కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే, సినిమా కాస్త రిలీఫ్ గా మారి ఉండేది. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రాఫీ ఫర్లేదనిపిస్తుంది. ఇక సినిమాకు పెద్ద డ్రాబ్యాక్, సందర్భం లేని పాటలు. మూవీ స్పీడందుకునే సమయంలో పాట వచ్చి టెంపోను దెబ్బ తీస్తుంటుంది. బ్యాగ్రౌండ్, పాటలు గుర్తుపెట్టుకోదగినంతేమీ లేవు.
తెలుగువన్ వ్యూ:
రైట్ రైట్ తరహా సినిమా కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూసి చూసి ఉన్నారు. సినిమా చూస్తున్నంత సేపూ ఎక్కడా కొత్తదనం కనిపించదు. తెలిసిన కథనే చూస్తున్న ఫీలింగ్ లో ఉన్న ఆడియన్స్ కు మధ్యలో వచ్చే సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ లా మరింత ట్రబుల్ పెడుతుంటాయి. ఓవరాల్ గా, రైట్ రైట్ ఆడియన్స్ చేత రైట్ సినిమా అనిపించుకోలేకపోయిందనే చెప్పాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com