జర్నలిస్ట్ దిగ్గజం-సీతారామ్

- May 30, 2024 , by Maagulf
జర్నలిస్ట్ దిగ్గజం-సీతారామ్

ఆయన జర్నలిజంలో అలాంటి అరుదైన వ్యక్తి.ఆయన గురించి రాయడం అంటే… ఇండియన్ జర్నలిజం గురించి రాయడమే. దాదాపు అరవై ఏళ్లపాటు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన పత్రికా రంగ ప్రమాణాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు సుప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారామ్.  

ధర్మవరపు సీతారామ్ నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలోని లక్కవరం గ్రామంలో  ధర్మవరపు లక్ష్మీ నరసయ్య , వరలక్ష్మీ దంపతులకు జన్మించారు. తండ్రి తనకున్న కొద్ది పాటి భూమిలో చేస్తున్న వ్యవసాయం కలసిరాక బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ రావడంతో ఆయనతో పాటుగా కుటుంబం మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడింది.  

సీతారాం కుటుంబ పోషణ కోసం పాలిటెక్నిక్ చదువును మధ్యలో ఆపేసి 17 ఏళ్ల వయస్సులో జర్నలిజం వృత్తి లోకి అడుగుపెట్టారు. చిన్నతనం నుంచే ప్రతి విషయాన్ని శ్రద్ధాసక్తులతో గమనించే అలవాటు ఉండటంతో పాటుగా పాత్రికేయ రంగానికి ఉన్న క్రేజ్ తో పాటు ఆసక్తి కూడా ఆయన్ని ఇటువైపు నడిపించింది . ఆ రోజుల్లో సికింద్రాబాద్ కేంద్రంగా నడిచిన "హైదరాబాద్ బులెటన్" అనే ఆంగ్ల దినపత్రిక ద్వారా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్ బులెటన్ లో పనిచేస్తున్న సమయంలోనే సీతారామ్ ఇంగ్లీషులో మాట్లాడటం, రాయడం మీద పట్టు సాధించడమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే తానే స్వయంగా సంపాదకీయాలు కూడా రాసే వారు. బులెటన్ తర్వాత స్టేట్స్ మాన్, ఎకనామిక్ టైమ్స్, పేట్రియాట్, మాస పత్రిక లింక్ మరియు ప్రముఖ వార్తా సంస్థలైన యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూ.ఎన్. ఐ) లో పనిచేశారు.

యూ.ఎన్.ఐతో సీతారామ్ బంధం విడదీయలేనిది. సుమారు 6 దశాబ్దాల జర్నలిస్ట్ జీవితంలో ఎక్కువ కాలం యూ.ఎన్.ఐ వార్తా సంస్థలోనే పలు విభాగాల్లో పనిచేశారు. ఆ సంస్థకి చెందిన హైదరాబాద్, మద్రాస్ , కలకత్తా న్యూస్ బ్యూరో లకు అధిపతిగా వ్యవహరించారు. న్యూ ఢిల్లీ, యూరప్ దేశాల్లో రిపోర్టర్ గా పనిచేశారు. హైదరాబాద్ యూ.ఎన్.ఐ విభాగం అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలకమైనది.

యూ.ఎన్.ఐ సంస్థలో పదవి విరమణ తర్వాత ఆయనే స్వయంగా హైదరాబాద్ కేంద్రంగా "థి స్కై లైన్" అనే ఆంగ్ల పత్రిక ను స్థాపించి నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ వచ్చారు కానీ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు గాను తన పత్రిక మీద అధికారులు కక్ష గట్టి మరి మూయించారు.ఆ తర్వాత కాలంలో వివిధ పత్రికల్లో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెలువడే ఆంగ్ల పత్రికలైన డెక్కన్ క్రానికల్ లో డీ.ఎస్ , థి హన్స్ ఇండియా లో "ఓల్డ్ హ్యాట్ " కాలమ్ ల పేరుతో తాను చనిపోయే వరకు పలు వ్యాసాలు రాసేవారు. సమకాలీన అంశాలపై ఆయన రాసిన విశ్లేణాత్మక వ్యాసాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేవి.

జర్నలిజం వృత్తికి వన్నె తెచ్చిన సీతారామ్ గారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మరికొన్ని సంస్థలు ఆయన్ని పురస్కారాలతో సత్కరించటం జరిగింది. "పత్రికా రచయితల ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు. సమర్థుడు ఏ పత్రికలో అయినా రాణిస్తాడు. పాఠకుల ఆదరాన్నీ, సాటి పత్రికా రచయితల నుంచి గౌరవాన్నీ పొందుతాడు" అని పలు సందర్భాల్లో సీతారామ్ పేర్కొన్నారు.

తన సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో ఎన్నో రకాల ఒత్తిళ్లు తట్టుకుని మరి  తన నిష్పక్షపాత వార్తలతో ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచేవారు. తన చివరి రోజుల్లో జర్నలిజం లో వేగంగా వస్తున్న అనేక రకాల చెడు పోకడలు చూసి బాధపడేవారు. జర్నలిజంలో నైతికత అంశంపై జరిగిన ఎన్నో వర్క్ షాప్స్ లలో పాల్గొని యువ జర్నలిస్టులకు అనేక సూచనలు చేశారు. "వార్తల చుట్టూ రాజకీయ నాయకులు తిరుగుతారు.రాజకీయ నాయకుల చుట్టూ పత్రికలు తిరగరాదు ఒక వేళ అలా చేస్తే అది పత్రిక కాదు" అని చెప్పటమే కాదు తన పాత్రికేయ వృత్తిలో ఆచరణలో చూపిన వ్యక్తి సీతారామ్.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com