సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే తాట తీస్తాం: డీజీపీ గుప్తా
- June 03, 2024
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పర్వం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఘర్షణలకు దారి తీసే ప్రతి అంశంపైనా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సోషల్ మీడియాను ఈసీ, నిఘా విభాగాలు జల్లెడ పడుతున్నాయి. విద్వేషపూరితమైన, రెచ్చగొట్టే పోస్టింగుల విషయంలో కొరడా ఝళిపిస్తోంది పోలీసు యంత్రాంగం.
ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు బాస్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ‘‘కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము’’ అని డీజీపీ స్పష్టం చేశారు. ఘర్షణలు, అల్లర్లకు సామాజిక మాధ్యమాల ద్వారా కారణమయ్యే వారిపై ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పిడి యాక్ట్ ప్రయోగించడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
గొడవలు, ఘర్షణలు, హింసకు దారితీసే పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టినవారితో పాటు.. వారిని ప్రోత్సహిస్తున్నవారినీ వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ తేల్చి చెప్పారు. అల్లర్లకు దారితీసే సోషల్ మీడియా పోస్టింగులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అలాగే, రెచ్చగొట్టేలా, బెదిరించేలా ఉన్న పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. సోషల్ మీడియా గ్రూప్ ల అడ్మిన్ లు కూడా అటువంటి పోస్టింగులు ప్రోత్సహించకూడదని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..