ఇండియన్ మూవీ మొఘల్...!

- June 06, 2024 , by Maagulf
ఇండియన్ మూవీ మొఘల్...!

దగ్గుబాటి రామానాయుడు...సినిమా పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి. చలన చిత్ర నిర్మాణంపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉన్న ప్రొడ్యూస‌ర్. నిర్మాతగానే కాకుండా వెండితెర‌పై కూడా న‌టించి మెప్పించారు.త‌న సంపాద‌న‌లో ఎక్కువ శాతం సినిమాకే ఖ‌ర్చు చేసేవారు. టెక్నాలజీని బ‌ట్టి సినిమా.. సినిమాను బ‌ట్టి వ‌సూళ్లు.. అని నమ్మారు కాబట్టే భారత దేశ చలన చరిత్రలో శ‌తాధిక  చిత్రాలను నిర్మించిన నిర్మాతగా నిలిచిపోయారు. నేడు ఇండియన్ మూవీ మొఘల్, డాక్ట‌ర్ ద‌గ్గుబాటి రామానాయుడు జయంతి.  

ద‌గ్గుబాటి రామానాయుడు 1936 జూన్ 6 తేదిన నాటి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీ దేవమ్మ దంపతులకు జన్మించారు. ఆనాడు, తమ కుటుంబానికి ఆత్మీయుడైన  ఒంగోలులోని ప్రముఖ డాక్టరు మరియు రాజకీయవేత్త అయినటువంటి డాక్టర్ బి.వి.ఎల్. నారాయణ ఇంట్లో వుంటూ S.S.L.C వరకు  చదువుకున్నారు.

రామానాయుడు సినిమాల్లోకి రాకముందు వ్యవసాయం, రైస్ మిల్ మరియు పలు వ్యాపారాలు చేసినా కలిసిరాలేదు. అదే సమయంలో తమ బంధువులైన యార్లగడ్డ వెంకన్న చౌదరి, యార్లగడ్డ లక్ష్మీ నారాయణ శంభు ఫిల్మ్స్ పతాకంపై అక్కినేని హీరోగా నమ్మిన బంటు అనే చిత్రాన్ని కారంచేడులో షూటింగ్‌ జరిగినప్పుడు, అన్ని వ్యవహారాలు చూసుకునే బాధ్యత తీసుకోని సినిమా యూనిట్ సభ్యులకు ఎటువంటి లోటు చూసుకున్నారు. ఆ సినిమాలో హీరో అక్కినేని కోరిక మేరకు ఒక సన్నివేశంలో నటించారు. ఈ సినిమాతోనే ఆయన సినిమా పరిశ్రమపై మక్కువ పెంచుకున్నారు.

ప్రముఖ దర్శకుడు గుత్తా  రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఓ ప్రొడ్యూసర్, భాగ‌స్వామ్య నిర్మాత‌ కోసం రామానాయుడిని సంప్ర‌దించారు. తండ్రిని ఒప్పించి 'అనురాగం' చిత్రంలో పెట్టుబడులు పెట్టారు రామానాయుడు. ఆ సినిమా విజయం సాధించకపోయినా ఆయనకు చిత్ర నిర్మాణ రంగం మీద స్పష్టమైన అవగాహన వచ్చింది.

1964లో త‌న పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరిట సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించారు. తమ బ్యానర్ మొదటి చిత్రంగా  ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. . ఇక అప్ప‌టి నుంచి వ‌రుస‌ విజ‌యాల‌తో నిర్మాత‌గా, ప్ర‌పంచ స్థాయిలో పేరు సంపాదించారు.

ద‌ర్శ‌కుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త టెక్నాలజీని అందించాల‌నే త‌ప‌న రామానాయుడికి ఉండేది. అప్పుడే సినిమాకు విలువ ఉంటుంద‌ని ఆయన న‌మ్మేవారు.కానీ ఒకానొక ద‌శ‌లో రామానాయుడిని సైతం నష్టాలనేవి కోలుకోలేని దెబ్బ కొట్టాయి. కానీ 'ప్రేమ్ న‌గ‌ర్' సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ కొట్టి, పరిశ్రమలో విజేతగా నిలిచారు ఆయన

 సినిమాకు ఎంత బ‌డ్జెట్ అయినా, నిర్మాత‌గా రామానాయుడు భ‌రించేవారు.ఎందుకంటే రామానాయ‌డు విజ‌న్ ఉన్న నిర్మాత‌. అందుక‌నే ద‌ర్శ‌కుల‌కు అభిమాన నిర్మాత‌గా మారారు. దేవ‌త‌, తాత మ‌నవ‌డు,  క‌లియుగ పాండ‌వులు, అగ్నిపూలు, ప్రేమించుకుందాం రా, అల్ల‌రి, ప్రేమించు, దృశ్యం వంటి ఎన్నో సినిమాలు నిర్మించి రామానాయుడు స‌క్సెస్ అయ్యారు.

వై. నాగేశ్వరరావు, కె.మురళీ మోహన్ రావు, బి. గోపాల్, జయంత్ సి. పరాన్జీ, చంద్రమహేష్ వంటి ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు రామానాయుడు. వాణిశ్రీ, ట‌బు, దివ్య‌వాణి, వెంక‌టేష్, అంజ‌లా జ‌వేరీ, హ‌రీష్, క‌రిష్మా క‌పూర్ వంటి ఎంద‌రో తార‌ల‌ను వెండితెర‌కి పరిచయం చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ భాషలలో కూడా  రామానాయుడు సినిమాలు నిర్మించారు.

తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తరవాత  "రామానాయుడు స్టూడియో"ను నిర్మించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని స‌దుపాయాల‌ను స్టూడియో, కలర్ ల్యాబ్‌, రికార్డింగ్‌ థియేటర్, డిస్ట్రిబ్యూషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్స్ యూనిట్‌తో వంటి అత్యాధునిక సదుపాయాలను తమ స్టూడియోలో ఏర్పరిచారు. విశాఖపట్నంలో సైతం మరో స్టూడియోను నిర్మించారు.

రామానాయుడు తోలి నుండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఒంగోలులో చదువుకున్న రోజుల్లోనే రెడ్ క్రాస్ సంస్థ తరుపున విరాళాలు సేకరించారు. విజయవాడ లయోలా కళాశాల ఏర్పాటుకు విరాళాలు సమకూర్చారు. భూదాన ఉద్యమంలో భాగంగా కారంచేడు వచ్చిన సర్వోదయ నేత వినోభా భావే సమక్షంలో తమ రెండు ఎకరాల సొంత భూమిని గ్రామంలోని దళితులకు దానం చేసి ఆయన మన్ననలు అందుకున్నారు. నిర్మాతగా ఎదిగిన తరువాత తన పేరిట స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ఎందరో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడం, ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించారు.

రామానాయుడు రాజకీయాల్లో సైతం రాణించారు. అప్పటి ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి బాపట్ల లోక్ సభకు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎంపీగా బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఎంపీ లాడ్స్ నిధులతో పాటుగా తన సొంత నిధులను వెచ్చించి నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్లు, కల్వర్టులు నిర్మించారు. బాపట్ల నియోజకవర్గంలో సాగు,త్రాగు నీటి వనరుల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే, పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై గళం విప్పారు.

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాల‌ను నిర్మించిన ప్రొడ్యూసర్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో రామానాయుడు చోటు సంపాదించారు. 2010 సెప్టెంబరు 9న మరల భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో స‌త్క‌రించింది. 2013లో సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ, భార‌త ప్ర‌భుత్వం ప‌ద్శ విభూష‌ణ్‌ను ప్ర‌క‌టించింది. ఇవే కాకుండా ఆయన పలు డాక్టరేట్లు అందుకున్నారు.  

రామానాయుడు వ్యక్తిగత జీవితానికి వస్తే 1957లో తన మేనమామ యార్లగడ్డ నాయుడమ్మ కుమార్తె రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కుమారుడు సురేశ్ బాబు తండ్రి బాటలో నడుస్తూ టాలీవుడ్ అగ్ర  నిర్మాతగా కొనసాగుతున్నారు. చిన్నకుమారుడు విక్టరీ వెంకటేశ్ టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. సురేశ్ బాబు పెద్ద కుమారుడు రానా సైతం పాన్ ఇండియా యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామానాయుడు మరో మనవడు నాగచైతన్య (కుమార్తె లక్ష్మీ కుమారుడు) సైతం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ యువ కథానాయకుడిగా కొనసాగుతున్నాడు.
   
రామానాయుడు ప్రస్థావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైన అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంత మమేకమైంది. ఆయన జీవితం తెరచిన పుస్తకం లాంటిది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ... భారత సినీ రంగానికే మకుటాయమానంగా నిలిచిన ఆదర్శ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2015 ఫిబ్రవరి 18 న తుది శ్వాస విడిచారు.  

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com