గ్రామాభివృద్ధిపై గ్రామస్తులతో చర్చ : ప్రకాష్ రాజ్

- June 11, 2016 , by Maagulf
గ్రామాభివృద్ధిపై గ్రామస్తులతో చర్చ :  ప్రకాష్ రాజ్

ప్రజలందరూ సహకరిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయన గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, యువకులతో అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామస్థులంతా అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు ఆయన వివరించారు.
గ్రామస్థులు, యువకులను గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో రెండు పురాతన బావులు ఉన్నాయని, వాటిని పూడ్చేందుకుగాను జిల్లా కలెక్టర్ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు వివరించారు. గ్రామంలో చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల నుంచి తీసిన పనికిరాని మట్టితో గ్రామంలో ఉన్న పురాతన బావులను పూడ్చివేసేందుకు కృషి చేయాలని ఇన్చార్జి ఎంపిడివో శ్రీనివాసచార్యను ప్రకాష్ రాజ్ కోరారు.
దీంతో పాటు గ్రామానికి గతంలో మంజూరైన మరుగుదొడ్లు త్వరగా నిర్మించే విధంగా కృషి చేయాలని ప్రజలకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 12 వేల రూపాయలు ఇస్తుండగా ప్రకాష్రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో పెద్దపెద్ద రాళ్లు బయటకు వస్తున్నాయని ఇన్చార్జి ఎంపిడివో దృష్టికి తీసుకురాగా దీనిపై స్పందించిన ఎంపిడివో ఆ రాళ్లను పగులుగొట్టి ఇంకుడు గుంతల్లో వేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని ప్రకాష్ రాజ్ పరిశీలించారు.
పాఠశాల అదనంగా రెండు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను మంజారు చేసినట్లు ప్రకాష్ రాజ్ వివరించారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా కొండారెడ్డిపల్లి గ్రామానికి పండ్ల మొక్కలు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.
ప్రకాష్ రాజ్ పర్యటనలో భాగంగా కొండారెడ్డి పల్లి సర్పంచ్ పి.రాజు, గ్రామస్థులు పల్లె ఆనంద్కుమార్, ఉప సర్పంచ్ సూరం శ్రీనివాస్, మండల వైద్యాధికారి శివప్రసాద్‍లతో పాటు గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com