సిక్కోలు యువ సంచలనం...!

- June 11, 2024 , by Maagulf
సిక్కోలు యువ సంచలనం...!

25 ఏళ్ల వయసులో ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు తాజా విజయంతో హ్యాట్రిక్ అందుకున్నారు. టీడీపీ మొత్తం 16 ఎంపీ స్థానాలు సాధించి ఎన్డీఏలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి.  మూడు సార్లు విజయం సాధించిన తన మిత్రుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం కల్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

రామ్మోహన్ నాయుడు 1987, డిసెంబరు 18న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో ఎర్రన్నాయుడు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి ఎర్రన్నాయుడు టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో సీనియర్ నేతగా 4 సార్లు ఎమ్యెల్యేగా, 4 సార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికయ్యారు. 1996-1998 మధ్యన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేశారు.

రామ్మోహన్  అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ పూర్తి చేసిన తర్వాత సింగపూర్ లో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి ఒక ప్రముఖ ఇంటీరియర్ డెవెలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవాడు.

2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేడర్ కోరిక, చంద్రబాబు సూచనలతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2013 నుంచి టీడీపీలో యాక్టీవ్ గా మారారు. చక్కని వాక్చాతుర్యం కూడా రామ్మోహన్ నాయుడు సొంతం. దీంతో ఆయన శ్రీకాకుళం ప్రజలకు త్వరగా కనెక్ట్ అయ్యారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వడంతో తండ్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నుంచి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు.

రామ్మోహన్ చిన్నతరంలోనే పార్లమెంట్ లోకి అడుగుపెట్టినా.. వివిధ అంశాలపై ఆయన గళమెత్తిన తీరు తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఇంగ్లిష్‌, హిందీ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉండడం అదనపు అడ్వాంటేజ్ గా మారింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా శ్రీకాకుళం నుంచి ఆయన మాత్రం ఎంపీగా విజయం సాధించారు. 2024లో సైతం శ్రీకాకుళం నుంచి భారీ మెజార్టీతో గెలిచి  హ్యాట్రిక్‌ సాధించారు.

సమయం, సందర్భాన్ని బట్టి టీడీపీ తరఫున బలమైన గొంతును వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు అద్భుతమైన ప్రసంగం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడడంలో రామ్మోహన్ నాయుడు దిట్ట.

36 ఏళ్లు మోడీ3.0 మంత్రివర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి ఎర్రన్నాయుడు లాగే.... అతి  పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా రికార్డు సృష్టించారు.1996లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు.. పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు.ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్‌గా ఘనత సాధించారు.


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com