అమెరికాలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ
- June 17, 2024
అమెరికా: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించడంతోపాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నార్త్ కరోలినాలో ఛార్లెట్‌లో ఎన్నారై టీడిపి, ఎన్నారై జనసేన, ఎన్నారై బిజెపి నాయకులు ఘనంగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. 125 కార్లతో విజయోత్సవ ర్యాలీతోపాటు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఛార్లెట్‌లోని మేనర్ ఫామ్‌హౌజ్‌లో విజయోత్సవ వేడుకలను పెద్దఎత్తున జరిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1000మందికిపైగా హాజరయ్యారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నారై నాయకులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. గుంటూరు ఎంపిగా గెలిచిన డా. చంద్ర పెమ్మసానిని, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును పలువురు అభినందిస్తూ ఎన్నారైలుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రాష్ట్రానికి సేవలందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయంకోసం ఛార్లెట్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిన పలువురు తాము ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకోసం చేసిన ప్రచార, ఇతర విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడియోల ద్వారా ఎన్నారైలు తమ గెలుపుకోసం చేసిన కృషిని మరవలేమంటూ, వారు చేసిన సహాయం ఇంకా కొనసాగించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి కృషి చేయాలని కోరారు. జూమ్ మీటింగ్‌లో గుంటూరు ఏంపీ డా. చంద్ర పెమ్మసాని, ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎన్నారై టీడిపి నాయకుడు జయరాం కోమటి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎన్నారైలు ఈ విజయంకోసంపడిన కష్టాలను, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు.
కార్యక్రమం తరువాత వచ్చినవారందరికీ బ్రహ్మాండమైన విందు భోజనాన్ని అందించారు. ఛార్లెట్‌లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడిపి నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు పలువురు, ఇతరులు ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.





తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







