పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

- June 17, 2024 , by Maagulf
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం..

కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది.ఈ ఘటనతో రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది.

అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతా లోని సెల్దాకు కంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది. న్యూజ‌ల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరి కొద్దినిమిషాలకే రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాదం తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ట్రాక్ పై నుంచి బోగీలను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఘోర రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. డీఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయంకోసం ఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించారని మమత పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలికి సీఎం మమత బెనర్జీ బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com