ఆదివాసీ ముద్దుబిడ్డ...!

- June 20, 2024 , by Maagulf
ఆదివాసీ ముద్దుబిడ్డ...!

ఏడు దశాబ్దాల భారత దేశ రాజకీయ చరిత్రలో ఆదివాసీ నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతిగా ఎన్నికైన మొట్టమొదటి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భార‌త 15వ రాష్ట్ర‌ప‌తిగా భాద్యతలు చేపట్టిన  ద్రౌప‌ది ముర్ము దేశ రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుతూ ముందుకు సాగుతున్నారు. నేడు ఆమె జన్మదినం.

ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. వీరిది ఆదివాసీ గిరిజన వర్గంలోని సంథాల్‌ తెగ. ఆమె తండ్రి, తాతలు వారి గ్రామానికి పెద్దలుగా వ్యవహరించారు.  

పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించిన ద్రౌపది.. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ చదివారు. ఆ తర్వాత టీచర్ గా తన కేరీర్ ను ఆమె ప్రారంభించారు. 197-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా, 1994 నుంచి 97 వరకూ రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ముర్ము 1997లో బీజేపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. నాటి బీజేపీ జాతీయ నాయకులైన వాజపేయ్, అద్వానీల స్పూర్తితో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికై క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు.

అంతకుముందు ఒడిశా రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌భంజ్‌ (పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2013లో ముర్ము బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలిగా చేశారు. 2015లో జార్ఖండ్‌ గవర్నర్‌ అయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు.2022 జూలై 25న భారత దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీ గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు.

ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం ఉజ్జ్వలంగానే సాగినా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. ముర్ము భర్త శ్యాంచరణ్‌ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, ద్రౌపది భర్త శ్యామ్ చరణ్ మరియు ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కుమార్తెకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు.

రాజకీయాల్లో కిందిస్థాయి కార్యకర్త నుంచి అత్యున్నతమైన దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఉందని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పలు మార్లు ఆమెను కొనియాడారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com